కేజీఎఫ్‌లో ‘బాంబే డాన్’ పాత్రతో పాపులర్ అయిన కన్నడ నటుడు దినేష్ మంగళూరు (55) దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. 

కేజీఎఫ్ నటుడు దినేష్ మృతి 

ప్రముఖ కన్నడ నటుడు దినేష్ మంగళూరు ఇకలేరు. 55 ఏళ్ళ వయసున్న దినేష్ నేడు ఆగస్టు 25న తుదిశ్వాస విడిచారు. దినేష్ దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. ఉడుపి జిల్లా కుందాపురలో తన నివాసంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యమే దినేష్ మరణానికి కారణం అని తెలుస్తోంది. 

దినేష్ మంగళూరు తన సినీ ప్రయాణాన్ని రంగస్థల నటుడిగా ప్రారంభించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్‌గా నెం.73 శాంతినివాస వంటి చిత్రాలకుపనిచేశారు. అయితే నటుడిగా ఆయనకు పెద్ద బ్రేక్ కె.ఎం.చైతన్య దర్శకత్వం వహించిన ఆ దినగళు చిత్రంతో వచ్చింది. అందులో ఆయన పోషించిన సీతారామ్ శెట్టి పాత్ర విపరీతమైన ప్రశంసలు అందుకుంది.

గుర్తింపు తెచ్చిన చిత్రాలు 

తర్వాత ఆయన ఉలిదవరు కందంటే, కిచ్చా, కిరిక్ పార్టీ వంటి సినిమాల్లో ప్రాధాన్య పాత్రల్లో నటించారు. అయితే, ఆయనకు అత్యధిక గుర్తింపు తెచ్చిపెట్టింది యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రం. అందులో ఆయన పోషించిన ‘బాంబే డాన్’ పాత్ర అభిమానులను ఆకట్టుకుంది.

అభిమానులు, కన్నడ చిత్ర పరిశ్రమ నటీనటులు ఆయన మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటుడు చేతన్ కుమార్ అహింస తన ఎక్స్ (Twitter) ఖాతాలో దినేష్ మరణానికి సంతాపం తెలిపారు. “ఆ దినగళు చిత్రంలో కలిసి పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. దినేష్ పోషించిన సీతారామ్ శెట్టి పాత్ర ఆ సినిమా కి పెద్ద ప్లస్ గా నిలిచింది. ఆయన కృషి రంగస్థలానికి, సినిమాకుచిరస్మరణీయం” అని పేర్కొన్నారు.

Scroll to load tweet…

దినేష్ కుటుంబం 

దినేష్ కి భారతి అనే భార్య, ఇద్దరు కుమారులు పవన్, సజ్జన్ ఉన్నారు. దినేష్ అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లోపు ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం ఉంచుతారట.