వేలంటైన్స్‌ డే ఫంక్షన్‌లో పాల్గొంటానని సన్నీలియోన్‌ రూ. 29 లక్షలు తీసుకున్నారని, కానీ రాలేదంటూ ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఆమెపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో కేసు కోర్టుకు వచ్చింది. 

ఈవెంట్‌ కంపెనీ కంప్లైంట్ మేరకు సన్నీలియోన్‌పై ఐపీసీ సెక్షన్‌ 420 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రీసెంట్ గా తిరువ‌నంత‌పురంలో టీవీ షో కోస‌మ‌ని వచ్చిన స‌న్నీ లియోన్‌ను ప్రశ్నించి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణలను బాలీవుడ్‌ బ్యూటీ ఖండించింది. ఈ కేసుపై ఆమె మంగళవారం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. సన్నీలియోన్‌ను అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. ముందుగా సన్నీలియోన్‌కు నోటీసులు ఇవ్వాలని సూచించింది. 

కేసు వివరాల్లోకివెళితే...బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌పై కేరళ పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. 2019లో కొచ్చిలో జరిగిన వేలంటైన్స్‌ డే ఫంక్షన్‌లో పాల్గొంటానని ఆమె రూ. 29 లక్షలు తీసుకున్నారని, కానీ రాలేదంటూ ఓ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ చేసిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్‌ 420 కింద కేసు నమోదైంది. కొచ్చి బ్రాంచ్‌ క్రైమ్‌ యూనిట్‌ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

వాస్తవాలను తాము పరిశీలించాల్సి ఉందని పోలీసులు వ్యాఖ్యానించారు. అయితే సన్నీ లియోన్‌ మాత్రం తాను రెండు సార్లు వచ్చానని, కానీ వారు కార్యక్రమాన్ని నిర్వహించలేదని చెబుతున్నారు. ఆ కార్యక్రమం అప్పటికే పలు మార్లు వాయిదా పడి చివరికి కొచ్చిలో ఖరారైంది. తనకు ఇంకా రూ. 12 లక్షలు వారే చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. చీటింగ్‌ చేసిందంటూ గతంలో కూడా కొందరు ఫిర్యాదు చేయడంతో ఈ హాట్‌ బ్యూటీపై కేసులు నమోదవడం తెలిసిందే.