ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ప్రారంభం రోజుల్లో సినిమా ప్రారంభమై ఆగిపోవటం జరిగితే పెద్ద నష్టమేమీ లేదనుకుంటారు. కానీ వాళ్లు ఫామ్ లోకి వచ్చాక ఆ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తామంటేనే ఉంటుంది అసలు రచ్చ. ఇప్పుడు కీర్తి సురేష్ ప్రారంభం రోజులనాటి సినిమాని దుమ్ము దులిపి రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. ఆ సినిమాకు టైటిల్ సైతం మార్చి వదులుదామనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఆ సినిమా కాపీరైట్స్ ఇష్యూ నడుస్తూ రచ్చ జరుగుతూ ఆలస్యం అవుతూ వస్తోంది.
 
వివరాల్లోకి వెళితే...కీర్తి సురేష్ హీరోయిన్ గా కెరీర్ మొదలెట్టిన రోజుల్లో  ఒక సినిమా మొదలై ఆగింది.సీనియర్ నటుడు నరేశ్ తనయుడు నవీన్ విజయ కృష్ణ  ఈ సినిమాలో హీరోగా నటించాడు. అనివార్య కారణాలతో ఈ సినిమా విడుదల నిలిచిపోయింది. తాజాగా, ఈ సినిమాను ఇపుడు విడుదల చేయబోతున్నారట. నూతన దర్శకుడు రామ్ ప్రసాద్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. 

ఆ సినిమాకు “జానకితో నేను” అనే టైటిల్ పెట్టారు అప్పుడు. ఆ తర్వాత కొన్ని రోజులకు “అయినా ఇష్టం నువ్వు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇన్నాళ్లకి “రెండు జళ్ల సీత” అనే టైటిల్ అంటున్నారు. అప్పడంటే సినిమాకు క్రేజ్ లేదు కాబట్టి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కీర్తి సురేష్ కి బోలెడెంత పేరు ఉంది. ఓటీటివాళ్లు ఎదురువచ్చి మంచి రేటు ఇచ్చి తీసుకుంటున్నారు. దాంతో ఇప్పుడు కీర్తి సురేష్ కు ఉన్న క్రేజ్ ని యూజ్ చేసుకునేందుకు ఈ “పాత” సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. 

అయితే ఈ సినిమాపై కాపీరైట్ ఇష్యూ నడుస్తోంది. వాస్తవానికి చంటి అడ్డాల ఈ సినిమాకు నిర్మాత. ఆయన ఈ సినిమా హక్కుల్ని తనకు అమ్మేశారని మరో నిర్మాత నట్టికుమార్ అంటున్నారు. తన దగ్గర బాండ్ పేపర్ సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అటు చంటి మాత్రం ఈ సినిమాను ఎవ్వరికీ అమ్మలేదంటున్నారు.  ప్రస్తుతం ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. చివరకు ఏమౌతుందో చూడాలి.