మహానటి తరువాత సౌత్ ఇండియాలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కీర్తి బెస్ట్ ఛాయిస్ గా మారారు. కమర్షియల్ గా భారీ విజయాన్ని అందుకున్న మహానటి, కీర్తి ఇమేజ్ ని పెంచేసింది. ప్రస్తుతం కీర్తి ఒక ప్రక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తూనే, కమర్షియల్ సినిమాలలో స్టార్ హీరోయిన్ గా కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. కీర్తి ప్రధాన పాత్రలో నటించిన రెండు చిత్రాలు అనుకున్నంత విజయం సాధించలేదు. 

పెంగ్విన్ మూవీలో కీర్తి నటనకు మంచి మార్కులే పడ్డా, ఓవర్ ఆల్ గా సినిమాకు ప్రేక్షకాదరణ దక్కలేదు. తాజాగా కీర్తి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ మిస్ ఇండియా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఓ టి టి లో విడుదలైన ఈ రెండు చిత్రాలు కీర్తికి గట్టి షాక్ ఇచ్చాయి. కీర్తి నటించిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ గుడ్ లక్ సఖి విడుదలకు సిద్ధంగా ఉండగా, ఈ సబ్జక్ట్స్ పట్ల ఆమె ఉత్సాహం చూపించడం లేదట. 

ఇకపై లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యారని సమాచారం. అందుకే ఆ తరహా సబ్జక్ట్స్ తో ఎవరైనా ఆమెను కలవడానికి వస్తే నో చెప్పేస్తుందట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, టాలీవుడ్ లో ప్రచారం అవుతుంది. 

జనవరి నుండి కీర్తి సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొననుంది. మరో వైపు నితిన్ కి జంటగా కీర్తి నటించిన రంగ్ దే షూటింగ్ చివరి దశలో ఉంది. సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.