కరోనా మహమ్మారి విజృంభన కొనసాగుతూనే ఉంది. అనేక మంది సామాన్యజనాలతోపాటు ప్రముఖులను కూడా బలితీసుకుంటోంది. బుధవారం తెలుగు నటుడు కోసూరి వేణుగోపాల్‌ కరోనా కన్నుమూశారు. తాజాగా కన్నడ హాస్య నటుడు రాక్‌లైన్‌ సుధాకర్‌(65) మృత్యువాత పడ్డారు. అయితే ఆయన కరోనా నుంచి కోలుకుని గుండెపోటుతో కన్నుమూయడం బాధాకరం. 

కొన్ని రోజుల క్రితం ఆయన కరోనాతో ఆసుపత్రిలో చేరారు. చాలా రోజులు దానితో పోరాడిన ఆయన కోలుకున్నారు. తిరిగి షూటింగ్‌ల్లో కూడా పాల్గొన్నారు. అందులో భాగంగా గురువారం కూడా ఆయనచిత్రీకరణలో పాల్గొనేందుకు వెళ్ళారు. ఉదయం పదిగంటల సమయంలో షూటింగ్‌ సెట్‌లోనే గుండెపోటుకు గురయ్యారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు నిర్థారించారు. 

కన్నడకు చెందిన సుధాకర్‌ `బెల్లి మొడగలు` చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. తనదైన కామెడీతో ఆడియెన్స్ ని అలరించిన సుధాకర్‌ని స్టార్‌ హీరోలు సైతం బాగా ఎంకరేజ్‌ చేశారు. దీంతో అతి తక్కువ టైమ్‌లోనే మంచి గుర్తింపు పొందాడు. `టోపీవాలా`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రామాచారి`,`భూతయ్యన మొమ్మగ అయ్యు`, `అయ్యో రామా`,`లవ్‌ ఇన్‌ మధ్య`, `పాంచరంగి`, `పరమాత్మ` వంటి రెండువందలకుపైగా చిత్రాల్లో నటించారు. సుధాకర్‌ మృతితో సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.