కన్నడ నటి రన్యా రావుకి బెంగళూరు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది మార్చిలో ఆమె దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ పట్టుబడ్డారు. 

రన్యా రావుకి ఏడాది జైలు శిక్ష 

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకి భారీ షాక్ తగిలింది. బెంగళూరు కోర్టు ఆమెకి ఏడాది జైలు శిక్ష విధించింది. రన్యా రావు అక్రమ బంగారం రవాణా కేసులో మార్చిలో పట్టుబడిన సంగతి తెలిసిందే. రూ. 12.56 కోట్ల విలువైన బంగారం అక్రమంగా దేశంలోకి తీసుకురావడంపై ఆమెపై ఈ శిక్ష ఖరారైంది. ఈ కేసులో విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆమెకు శిక్ష విధించబడింది.

12.56 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ 

మార్చిలో, రన్యా రావు దుబాయ్ నుండి బెంగళూరుకి వస్తుండగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద 14.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారానికి మార్కెట్ విలువ రూ. 12.56 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.

రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (DRI) అధికారులు విచారణ చేపట్టి, బంగారం అక్రమ రవాణాలో ఆమె పాత్రను నిర్ధారించారు. ఆమె అసలు పేరు హర్షవర్ధిని రన్యా, సినిమాల్లో రన్యా రావుగా గుర్తింపు పొందింది.

 అధికారులు చార్జ్‌షీట్‌ను సకాలంలో దాఖలు చేయకపోవడంతో, న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే,విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం ఆమెపై కఠినమైన నిర్భంద చర్యలు కొనసాగించడంతో ఆమె ఇంకా కస్టడీలోనే ఉన్నారు.

ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ 

ఇంతలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ కేసును మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద దర్యాప్తు చేపట్టి, రన్యా రావు పేరిట ఉన్న రూ. 34.12 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందులో బెంగళూరులోని విక్టోరియా లేఅవుట్‌లో నివాసం, ఆర్కావతి లేఅవుట్‌లోని ప్లాట్, తుమకూరులో పారిశ్రామిక భూమి, అలాగే అనేకల్ తాలూకాలో వ్యవసాయ భూమి ఉన్నాయి.

ఈ మొత్తం ఆస్తులు బంగారం అక్రమ రవాణా ద్వారా లభించిన ముడుపులతో కొనుగోలు చేసినట్లు ఈడి అధికారులు పేర్కొన్నారు. కేసు సంబంధిత విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.