వివాదాలను ఆరకండా రాజేస్తూ,వార్తల్లో నిలవటంలో కంగనా సోదరి రంగోలికి మించిన వాళ్లు లేరు. ఆమె సూటిగా ఎవరినైనా విమర్శించగలరు. తిట్టిపోయగలరు. తన అక్కపై ఈగ వాలకుండా సోషల్ మీడియాలో ఆమె చేసే హంగామా కొందరికి కామెడీగా అనిపిస్తే మరికొందరికి అరికాలి మంట తలకెక్కుతోంది. ఇప్పుడు ఏక్తాకపూర్ పరిస్దితి అలాగే ఉందిట. రిలీజ్ ముందు మీడియాను కంగనా కెలుక్కుంది..ఏదో సారి చెప్పి బుజ్జగిస్తూంటే , ఇప్పుడు రంగోలి తగులుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ . ఇటీవల ఈ సినిమాలోని ఓ పాటను ముంబయిలో విడుదల చేశారు. ఆ సందర్భంలో ఓ జర్నలిస్టుపై కంగన దారుణమైన కామెంట్స్ చేశారు. ఆ జర్నలిస్ట్ ...‘మణికర్ణిక’ సినిమాకు తక్కువ రేటింగ్‌ ఇచ్చారని, సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాశాడని సమావేశంలో మండిపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో రెండు రోజుల క్రితం వైరల్‌ అయ్యింది. 

దీంతో కంగన వెంటనే క్షమాపణలు చెప్పాలని ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్ ఆఫ్ ఇండియా’ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కంగనను బహిష్కరిస్తామని, ఆమెకు సంబంధించి ఎటువంటి పబ్లిసిటీ చేయమని పేర్కొంది. దీంతో ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటనపై క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. 

సినిమా సాంగ్  విడుదల కార్యక్రమంలో వివాదం తలెత్తిన కారణంగా క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేసింది. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. తమ సినిమా ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ జులై 26న విడుదల కాబోతోందని, మీడియా ఈ సంఘటనను మర్చిపోయి ఎప్పటిలాగే సహకరించాలని కోరింది.

మరోపక్క కంగన క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె సోదరి రంగోలి ట్వీట్‌ చేశారు. ‘కంగన సారీ చెప్పదు. ఆమెను క్షమాపణలు చెప్పమని అడిగే అర్హత మీకు లేదు. మీలాంటి దేశ ద్రోహుల్ని, తప్పుడు వ్యక్తుల్ని కంగన సరైన మార్గంలో పెడుతుంది’ అని పోస్ట్‌ చేశారు. అయితే కంగన, రంగోలి తీరుతో ఇప్పుడు ఏక్తా కపూర్ తల పట్టుకుందిట. మళ్లీ సమస్యను మొదటకి తెస్తోందని ఏం చేయాలో అర్దం కావటం లేదని వాపోతోందిట.