ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన 'బాహుబలి' చిత్రం రచయిత విజయేంద్రప్రసాద్ తో  ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనత్ రీసెంట్ గా మణికర్ణిక చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే రచయిత ఇచ్చిన కథతో కంగన సినిమా చెయ్యబోతోంది. 

అలనాటి స్టార్ హీరోయిన్ , దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం  రూపొందించనున్నారు. ఈ చిత్రంలో జయ పాత్రలో  కంగనా రనౌత్‌ నటిస్తోంది. నేడు కంగన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్  ఈ విషయాన్ని ప్రకటించింది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం తమిళంలో ‘తలైవి’గా, హిందీలో ‘జయ’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ తెరకెక్కించనున్నారు.

దర్శకుడు విజయ్‌ మాట్లాడుతూ ‘‘దేశంలోని ప్రముఖ రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. ఇప్పుడు ఆమె జీవితాన్ని తెరకెక్కిస్తున్నామంటే మాపై ఎంతో బాధ్యత ఉంది. అందుకే ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దేశం గర్వించే కథా  నాయిక కంగనా రనౌత్‌ ఇందులో నటించడం ఆనందంగా ఉంది’’అన్నారు. 

‘‘ఈ శతాబ్దంలోనే విజయవంతమైన మహిళల్లో జయ లలిత ఒకరు. రాజకీయ రంగంలో ఆమె ఓ ఐకాన్‌. ఆమె జీవితం సినిమా కథకు చక్కగా సరిపోతుంది. ఆమె పాత్రలో నటిస్తుండడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను’’ అని చెప్పింది కంగన.  

జయలలిత బయోపిక్ తలైవి సినిమాకు నిర్మాతగా విష్ణు ఇందూరి వ్యవహరిస్తున్నారు. మొత్తానికి  బాహుబలి, మణికర్ణిక వంటి గొప్ప సినిమాలకు కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ తలైవి సినిమాలో కూడా పనిచేయటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. కాగా జీవీ ప్రకాశ్ సంగీతం, నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా, మదన్ కార్వి పాటల రచయితగా పనిచేస్తున్నారని ఇప్పటికే ఏఎల్ విజయ్ తెలిపారు.