కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కరోనా దెబ్బకి నెమ్మదిగా ఒక్కొక్కటి బ్రేక్‌ అవుతున్నాయి. లాక్‌డౌన్‌ ఉండబోదంటూనే నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. ఈ ఎఫెక్ట్ సినిమాలపై కూడా పడుతుంది. క్రమంగా సినిమాలు వాయిదా వేసుకుంటున్నాయి. నిన్న(గురువారం) తెలుగు సినిమా `లవ్‌స్టోరి` వాయిదా పడింది. ఈ నెల 16న విడుదల కావాల్సిన ఈ సినిమాని కరోనా వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు మరో పాన్‌ ఇండియా మూవీ `తలైవి`ని పోస్ట్ పోన్‌ చేశారు. ఈ నెల 23న విడుదల కావాల్సిన కంగనా రనౌత్‌ నటించిన `తలైవి` చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. 

`ఇటీవల విడుదల చేసిన `తలైవి` ట్రైలర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్ వస్తోంది. అందుకు రుణపడి ఉంటాము. సినిమాని రూపొందించే క్రమంలో టీమ్‌ ఎన్నో సాక్రిఫైజెస్‌ చేసింది. అందుకు వారందరికి ధన్యవాదాలు. ఈ సినిమాని ఇతర భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్‌ చేయాలని నిర్ణయించాం. దీనికి అందరు సహకరించారు. కానీ ఇప్పుడు కోవిడ్‌ 19 బాగా విస్తరిస్తోంది. ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. గవర్నమెంట్‌ నిబంధనలు కఠినతరం చేస్తుంది. ఇలాంటి సమయంలో వారికి మనం కూడా సపోర్ట్ చేయాలి. అందుకే ఈ నెల 23న విడుదల చేయాల్సిన `తలైవి` సినిమాని పోస్ట్ పోన్‌ చేస్తున్నాం. మరో డేట్‌ని త్వరలో ప్రకటిస్తాం. మీ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుతున్నాం` అని యూనిట్‌ పేర్కొంది. 

మాజీ సీఎం, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న `తలైవి` చిత్రంలో టైటిల్‌ రోల్‌లో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ నటిస్తుంది. ఎంజీఆర్‌గా ఇందులో అరవింద్‌ స్వామి నటిస్తున్నారు. ఎంజీఆర్‌ సతీమణి జానకీ రామచంద్రన్‌ పాత్రలో మధుబాల నటించారు. ఏఎల్‌ విజయ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు.