బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్ గురించి ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇండస్ట్రీ వారసత్వం మీద తన చెల్లెలితో కలిసి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఎవరైనా తన జోలికి కానీ తన చెల్లెలి జోలికి కానీ వస్తే అసలు ఊరుకోదు. మంగళవారం నాడు తన చిన్ననాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు రంగోలీ.

దానికి నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా రంగోలీ వారికి థాంక్స్ చెబుతూ తాను కాలేజ్ లో దిగిన ఫోటోని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె ఎంతో అందంగా ఉంది. దీంతో నెటిజన్లు ఎన్నో కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన జీవితంలో చోటుచేసుకున్న ఓ సంఘటన గురించి రంగోలీ నెటిజన్లతో పంచుకున్నారు.

డెహ్రాడూన్ లో ఉత్తరాంచల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో ప్రేమ పేరుతో ఒక వ్యక్తి తనను టార్చర్ చేసి.. లీటర్ యాసిడ్ తనపై పోశాడని.. దీంతో తన ఎడమ వైపు ముఖం, చెవి, బ్రెస్ట్ మొత్తం కాలిపోయాయని చెప్పింది.  ఐదేళ్ల పాటు 54 సర్జరీలు చేయించుకున్న తర్వాత తన ముఖం ఇలా మారిందని.. అదే సమయంలో తన సోదరి కంగనను కూడా చావగొట్టారని తనని చంపేసేవారని ఆవేదన వ్యక్తం చేసింది.

తన తల్లిదండ్రులు అందమైన, తెలివైన ఇద్దరు ఆడపిల్లలకు జన్మనివ్వడమే దీనికి కారణమని ఎమోషనల్ అయింది. ఇప్పటికీ ప్రపంచం ఆడపిల్ల పుట్టుకతో సంతోషంగా లేదుని.. అలాంటి ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడి మన ఆడపిల్లలను కాపాడుకునే సమయం వచ్చిందని.. తనపై యాసిడ్ దాడి జరిగాక జీవితంపై ఆశలు వదులుకున్నానని చెప్పింది. ఆ సమయంలో తన స్నేహితుడు గాయాలను శుభ్రం చేసి ఐదేళ్ల పాటు తనకు సర్జరీలు జరిగిన ప్రతీసారి ఆపరేషన్ థియేటర్ బయటే పడిగాపులు కాసాడని.. అతనే ఇప్పుడు తన భర్త అని చెప్పింది.

తన భర్త, సోదరి, తల్లిదండ్రులు మరోసారి తన జీవితానికి ప్రాణం పోశారని చెప్పింది. ఇప్పటికీ తను ఈ యాసిడ్ దాడి కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పింది. బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. తనపై ఈ దాడి చేసినవాడికి శిక్ష పడేలా చేయాలని అనుకున్నట్లు కానీ తన సోదరి కంగనా అవేవీ పట్టించుకోవద్దని చెప్పి తనను మార్చే ప్రయత్నం చేసిందని చెప్పింది.