బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా ప్రెస్ మీట్ లో ఓ విలేకరితో గొడవకి దిగింది. దీంతో మీడియా వర్గాలు ఆగ్రహించాయి. కంగనా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఆమెని బాయ్కాట్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే తను మాత్రం క్షమాపణలు చెప్పాలని అనుకోవడం లేదు కంగనా.. దయచేసి నన్ను నిషేధించండి అంటూ పలు మీడియా వర్గాలను వేడుకుంటోంది.

కంగనా సోదరి రంగోలి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో కంగనా పలు మీడియా వర్గాలను ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేసింది. తనకు మీడియా చాలా సందర్భాల్లో మద్దతుగా నిలిచిందని.. మీడియాలో తనకు స్నేహితులు ఉన్నారని.. తనను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ వస్తున్నారని చెప్పుకొచ్చింది.

అలాంటి వారికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పింది. అయితే కొన్ని మీడియా వర్గాలు మాత్రం దేశాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని.. ఇలాంటి వారిని మన దేశం శిక్షించలేదని చెప్పింది. వీళ్లకు దేశం పట్ల ఎలాంటి భక్తి ఉండదని.. కానీ నాకు దేశం పట్ల భక్తిలేదని ఆరోపిస్తుంటారని  మండిపడింది. పర్యావరణ దినోత్సవం రోజున ఈషా ఫౌండేషన్ తరఫున ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటే ఓ విలేకరి తనపై జోకులు వేస్తూ ఆర్టికల్ రాశాడని.. ఇలాంటి వారు విలేకరులమని ఎలా చెప్పుకుంటున్నారో అర్ధం కావడం లేదని చెప్పింది.

ఓ విలేకరి తను నటించిన సినిమా గురించి తప్పుగా రాస్తే నిలదీసినందుకు.. అక్కడే ఉన్న మరో నలుగురు విలేకర్లు తనపై కేకలు వేశారని.. తనను నిషేధించాలని ఆందోళన చేశారని.. బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పింది. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీని ఏలుతున్నట్లైతే.. నేను టాప్ హీరోయిన్ అయ్యేదాన్ని కాదు కదా..? అంటూ చెప్పుకొచ్చింది. దయచేసి తనను బ్యాన్ చేయాలని కొన్ని మీడియా వర్గాలను కోరింది. ఎందుకంటే తన ద్వారా వచ్చే వార్తలతో మీరు మీ కుటుంబాన్ని పోషించకూడదు అని వెల్లడించారు.