బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తరచూ తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ విలేకరితో గొడవ పడి మరోసారి వార్తల్లోకెక్కింది. కంగనా నటిస్తోన్న తాజా చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాలో ఓ పాటను ఆదివారం నాడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఓ విలేకరి కంగనాను సినిమా గురించి ప్రశ్నిస్తుండగా.. ఆమె మధ్యలో కలగజేసుకొని 'మీరు నేను నటించిన మణికర్ణిక సినిమా గురించి అలా రాయడం తప్పని అనిపించడం లేదా.? అలాంటి సినిమా తీసి నేనేమైనా తప్పు చేశానా..? నా గురించి అలా ఇష్టమొచ్చినట్లు ఎలా రాస్తారు..?' అని అడిగింది.

దీనికి సదరు విలేకరి సమాధానమిస్తూ.. 'నేనెప్పుడు మీ గురించి తప్పుగా రాశారు..? మీరో స్టార్ హీరోయిన్ అయినంతమాత్రాన ఓ విలేకరిని ఇలా బెదిరిస్తున్నట్లు మాట్లాడడం కరెక్ట్ కాదు' అని అన్నారు. దీనికి కంగనా.. 'మణికర్ణిక సినిమా సమయంలో మీరు నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు.. నా వ్యానిటీ వ్యాన్ లో కూర్చొని మూడు గంటల పాటు ఇంటర్వ్యూ చేశారు. మనమిద్దరం కలిసి భోజనం కూడా చేశాం' అని అన్నారు.

ఇదంతా ఎప్పుడు జరిగిందని సదరు విలేకరి ఆశ్చర్యపడుతూ అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటలు యుద్ధాన్ని తలపించాయి. మరో విలేకరి గట్టిగా కేకలు వేయడంతో కంగనా క్షమాపణలు చెప్పారు.  దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani) on Jul 7, 2019 at 11:17am PDT