`బింబిసార` చిత్రాన్ని తాతగారు ఎన్టీఆర్‌కి అంకితం ఇస్తున్నట్టు తెలిపారు కళ్యాణ్‌ రామ్‌. అలాగే సినిమా ఈ సారి డిజప్పాయింట్‌ చేయదని పేర్కొన్నారు. `బింబిసార` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

`బింబిసార` చిత్రాన్ని తాత నందమూరి తారకరామారావుకి అంకితమిస్తున్నట్టు తెలిపారు హీరో కళ్యాణ్‌ రామ్‌. తాతగారి వందవ జయంతి కావడం విశేషమన్నారు. అంతేకాదు ఈ సారి ఎట్టిపరిస్థితుల్లో అభిమానులను నిరాశ పర్చనని హామీ ఇచ్చారు. కళ్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన `బింబిసార` చిత్రం ఆగస్ట్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఎన్టీఆర్‌ గెస్ట్ గా హాజరయ్యారు. 

ఇందులో కళ్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ, ఆసక్తికర విసయాలు వెల్లడించారు. `మనందరికి చందమామ కథలంటే ఇష్టం. అమరచిత్ర కథలంటే బాగా ఇష్టం. జానపద సినిమాలంటే ఇంకా బాగా ఇష్టం. అది మొదటిసారి మొదలు పెట్టింది మా తాతగారు(ఎన్టీఆర్‌). ఆయన `పాతాళభైరవి` చేశారు. అలాగే బాబాయ్‌ బాలకృష్ణ `భైరవ ద్వీపం` చేశారు. చిరంజీవిగారు `జగదేక వీరుడు అతిలోక సుందరి` చేశారు. ఇలా ఎన్నో జానపద సినిమాలొచ్చాయి. అదే కోవలో ఓ మంచి జానపద చిత్రం, మంచి సోషియో ఫాంటసీ మూవీ మీకు అందించాలనే ప్రయత్నమే `బింబిసార` చిత్రం. ఆగస్ట్ 5న విడుదలవుతుంది. కచ్చితంగా థియేటర్లలోనే చూడాలని కోరుకుంటున్నా. 

అయితే ఈ సారి మాత్రం మిమ్మల్ని ఏమాత్రం డిజప్పాయింట్‌ చేయను. అది మాత్రం ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ జరగదు. వందకి రెండు వందల శాతం మీరంతా సాటిస్పై అవుతారు. గర్వంగా కూడా ఫీలవుతారు. ఎందుకంటే ఈ ఏడాది మా తాతగారు వందవ పుట్టిన ఏడాది. తెలుగు సినిమాకి మూల కారకుడైనా, మాకు మూల కారకుడైనా తాతగారు ఎన్టీఆర్‌కి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నాం` అని అన్నారు కళ్యాణ్‌ రామ్‌. 

ఈ సందర్భంగా `బింబసార` చిత్రంలో నటించిన నటీనటులు, టెక్నీషియన్లకి ధన్యవాదాలు తెలిపారు. సినిమాకి ప్రాణం పోసిన సంగీత దర్శకుడు కీరవాణికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే సినిమా చేయడానికి కర్త, కర్మ, క్రియ నిర్మాత హరికి ధన్యవాదాలు తెలిపారు. ఆయన లేకుంటే ఈ సినిమా లేదన్నారు. దర్శకుడు వశిష్ట అద్బుతమైన సినిమాని తీశారని తెలిపారు. అదే సమయంలో తమ పిల్లలకు ట్యూషన్‌ చెప్పడానికి వచ్చిన వాసుదేవ్‌ ఈ చిత్రానికి డైలాగ్‌లు రాశారని చెప్పడం విశేషం. చివరగా తన తమ్ముడు ఎన్టీఆర్‌కి థ్యాంక్స్ చెప్పనని, లవ్యూ అని, తమ మధ్య బంధం ఎప్పుడూ అలానే ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు కళ్యాణ్‌ రామ్‌.