చిన్న సినిమాగా వచ్చిన అర్జున్ రెడ్డి టాలీవుడ్ లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. సందీప్ వంగ దర్శకత్వం, విజయ్ దేవరకొండ నటనతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వ్యసనాలకు బానిసైన వైద్యుడిగా విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించాడు. ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ టైటిల్ తో తెరకెక్కించారు. హిందీ వర్షన్ కి కూడా సందీప్ వంగానే దర్శకుడు. శుక్రవారం జూన్ 21న కబీర్ సింగ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కాగా గల్ఫ్ దేశాల్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ప్రేక్షకుల నుంచి కబీర్ సింగ్ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. షాహిద్ కపూర్ నటనతో అదరగొట్టేశాడని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చినా షాహిద్ నటన మిమల్ని వెంటాడుతోందని, అంత అద్భుతంగా షాహిద్ కపూర్ తన పాత్రలో ఒదిగిపోయినట్లు సినిమాని చూసిన ఆడియన్స్ పేర్కొంటున్నారు. 

కథలో పెద్దగా మార్పులు చేయకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. సందీప్ వంగా దర్శకత్వం బావుందని అంటున్నారు. ప్రముఖ క్రిటిక్ ఉమర్ సందు కబీర్ సింగ్ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ.. సెన్సార్ లో ఈ చిత్రాన్ని చూశా. షాహిద్ కపూర్ తన పెర్ఫామెన్స్ తో హృదయాలు కొల్లగొట్టేశాడు. అద్భుతమైన చిత్రం అంటూ ట్వీట్ చేశాడు.