టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) కారును జూబ్లీ హిల్స్ పోలీసులు అడ్డుకున్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీ లు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు.
మోటార్ వెహికిల్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు నిన్న రాత్రి ముమ్మర చర్యలు చేపట్టారు. కార్ల సైడ్ విండో గ్లాసెస్ కు ఉన్న బ్లాక్ ఫిలింలు, అనాధికారికమైన ఎమ్మెల్యే స్టిక్కర్లతో తిరుగుతున్న కార్లను గుర్తించేందుకు సైఫాబాద్, జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్ ను నగరంలోని ఖైరతాబాద్ జోన్ పరిధిలోని ఇందిరాగాంధీ చౌరస్తా, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, ఫిలింనగర్ చౌరస్తా వంటి ప్రాంతాల్లో ఆదివారం తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా ఆ ప్రాంతాల్లో బ్లాక్ ఫిలింతో తిరుగుతున్న కార్లను, ఎమ్మెల్యే స్టిక్కర్ల కార్లతో తిరుగుతున్న కార్లను గుర్తించారు. కార్ల విండో గ్లాస్ లకు ఉన్న ఫిలింలను, ఎమ్మెల్యే స్టిక్కర్లను తొలగించారు. పలువురికి జరిమానాలు కూడా విధించారు. ఈ క్రమంలో ఫిలింనగగర్ చౌరస్తా ప్రాంతంలో జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన కారును పోలీసులు అడ్డుకున్నారు. కారుకున్న ఉన్న బ్లాక్ ఫిలింను తొలగించారు. అయితే కారులో ఎన్టీఆర్ లేకపోవడంతో డ్రైవర్ కు ట్రాఫిక్ రూల్స్ ను తెలియజేస్తూ బ్లాక్ ఫిలింను మరోసారి అంటించరాదని సూచించినట్టు సమాచారం.
అయితే కారులో జూనియర్ ఎన్టీఆర్ కొడుకు ఉన్నట్టు సమాచారం. ఆ చిన్నారితో పాటు మరో వ్యక్తి కూడా కారులోనే ఉన్నాడు. అలాగే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఏపీకి చెందిన శ్రీధర్ రెడ్డ పేరుతో స్టిక్కరున్న వాహనాలను పోలీసులు గుర్తించారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 90 వాహనాలకు బ్లాక్ ఫిలింను తొలగించారు. పలువురికి ఫైన్లు కూడా విధించినట్టు సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రాంచందర్, జూబ్లీహిల్స్ సీఐ ముత్తు తెలిపారు.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’(RRR) మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. నిన్న గుజరాత్ లో సందండి చేసిన ఆర్ఆర్ఆర్ టీం ప్రస్తుతం పంజాబ్ లో ఉంది. తాజాగా సమాచారం ప్రకారం.. అమ్రుత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ను సందర్శించింది. మార్చి 25న రిలీజ్ కానున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ ను జక్కన్న దగ్గరుండి మరీ నిర్వహిస్తున్నారు. భారీ రెస్పాన్స్ ను సొంతం చేసుకునేందుకు దేశమంతటా చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించగా, డీవీవీ దానయ్య నిర్మించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan)తో పాటు ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా సరన్ కూడా పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
