ఇటీవల జరిగిన ఎన్నికల్లో పవర్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ తరఫున పోరాడి ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే పవన్ రాజకీయాల్లోకి వెళ్లడానికి ఇంకాస్త సమయం తీసుకొని ఉండాల్సిందంటూ నటుడు జేడి చక్రవర్తి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సినిమా వాళ్లు ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లొచ్చని కానీ దానికి సమయం చాలా అవసరమని అన్నారు. సినిమా వాళ్లు పాలిటిక్స్ లోకి వెళ్లకూడదనే రూల్స్ లేవు కానీ అలా వెళ్లాలని అనుకునేవాళ్లు కాస్త టైం తీసుకుంటే బాగుంటుందని, పవన్ కూడా అదే కేటగిరీలోకి వస్తాడని చెప్పారు.

పవన్ చాలా తొందరగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ లాంటి ఎమోషనల్ వ్యక్తులు ముందుగా తమ అభిప్రాయాలను ప్రజల్లోకి బలంగా పంపించిన తరువాత రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందని అన్నారు. 

పవన్ ఎమోషనల్ అనే విషయం చాలా మందికి తెలియదని, ఈ విషయం ప్రజలకు తెలియడానికి ఇంకా టైం పడుతుందని, మొన్న జరిగిన ఎన్నికల వేళ అంత సమయం దొరకలేదని, మరో ఐదేళ్ళు సమయం ఉంది కాబట్టి ప్రజలు పవన్ ఎమోషన్స్ ని అర్ధం చేసుకుంటారని అన్నారు. తనకు రాజకీయాలంటే అసహ్యమని చెప్పారు జేడి చక్రవర్తి.  ఇటీవల విడుదలైన 'హిప్పి' సినిమాలో జేడి ముఖ్య పాత్ర పోషించారు.