అమితాబ్‌ బచ్చన్‌ భార్య, సీనియర్‌ నటి జయా బచ్చన్‌, మరో సీనియర్‌ నటి షబానా అజ్మీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వారి హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. 

బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ భార్య, సీనియర్‌ నటి జయబచ్చన్‌కి కరోనా సోకింది. థర్డ్ వేవ్‌లో అనేక మందికి కరోనా సోకుతున్న విసయం తెలిసిందే. మొదటి రెండు వేవ్‌లో మిస్‌ అయిన వాళ్లు కూడా ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగా జయబచ్చన్‌కి కోవిడ్‌ 19 నిర్థారణ అయ్యింది. అయితే ఆమెకి కరోనా సోకి ఐదురోజులవుతుందట. ఆమెతోపాటు మరో సీనియర్‌ నటి షబానా అజ్మీకి కూడా కరోనా సోకింది.

ఈ విషయాన్ని ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు. `ఈ రోజు(శుక్రవారం)కి జయబచ్చన్ కి కరోనా సోకి ఐదు రోజులవుతుంది` అని తెలిపారు. జయబచ్చన్‌ ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. అయితే తనకు కోవిడ్‌ సోకిన విషయాన్ని షబానా వెల్లడించింది. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపింది. అయితే జయబచ్చన్‌కి కరోనా సోకిందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అమితాబ్‌ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. జయబచ్చన్‌ ఆరోగ్యంపై సైతం వారు ఆరా తీస్తున్నారు. 

ప్రస్తుతం జయబచ్చన్‌, షబానా అజ్మీ కలిసి `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ` చిత్రంలో నటిస్తుంది. ఇందులో రణ్‌వీర్‌ సింగ్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్నారు. ధర్మేంద్ర కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇద్దరు సీనియర్‌ నటులకు కరోనా సోకడంతో ఈ చిత్ర షూటింగ్‌ని వాయిదా వేసినట్టు కరణ్‌ జోహార్‌ వెల్లడించారు. `రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ` చిత్ర షూటింగ్‌ ఫిబ్రవరి రెండు నుంచి ప్రారంభమైంది. ఢిల్లీలో ఈ చిత్ర షూటింగ్‌ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వరకు ఈ షెడ్యూల్‌ ప్లాన్‌ చేశారట. కరోనా నేపథ్యంలో టీమ్‌ సేఫిటీని దృష్టిలో పెట్టుకుని చిత్ర షూటింగ్‌ని వాయిదా వేశారు. 

ఇదిలా ఉంటే గతేడాది అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్య అందరూ కరోనా బారిన పడ్డారు. అప్పుడు జయా బచ్చన్‌ ఈ మహమ్మారికి చిక్కలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె వైరస్‌ నుంచి తప్పించుకోలేకపోయారు. తాజాగా జరిపిన కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో బిగ్‌బీ సతీమణికి కరోనా పాటిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. గత నెల ప్రారంభంలో కూడా అమితాబ్‌ బచ్చన్‌ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేపింది. ముంబయిలోని బిగ్‌బీ ఇంట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది.