ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తూ, అటు మహారాష్ట ప్రభుత్వాన్ని, ఇటు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తున్న బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌పై పరువు నష్టం కేసు నమోదైంది. ప్రముఖ కవి, రచయిత జావేద్‌ అక్తర్‌.. కంగనపై ఈ ఫిర్యాదు చేశారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసినందుకుగానూ పరువు నష్టం దావా వేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 

పశ్చిమ ముంబయిలోని అంథేరిలోని మెట్రో పాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు దాఖలు చేసిన కేసులో, కంగనాపై పరువు నష్టం కోసం  ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో బాలీవుడ్‌లో `కోటరీ` గురించి ప్రస్తావిస్తూ కంగనా అందులో తన పేరు లాగారని, తనపై నిరాధారమైన ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు.  కంగనా అనేక రకాలుగా విడగొట్టి విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. 

ఇదిలా ఉంటే కంగనాకి ముంబయి పోలీసులు మరోసారి సమన్లు పంపించారు. సోషల్‌ మీడియా పోస్టుల ద్వారా సమాజంలో విభేదాలు సృష్టిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో కంగనాపై, ఆమె సోదరి రంగోలిపై ముంబయిలో కేసు నమోదైంది. ఇప్పటికే బాంద్రా పోలీసులు అక్టోబర్ 21న తొలిసారి వీరికి సమన్లు జారీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరగా, ప్రస్తుతం తాను హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్నానని, తన కజిల్‌ మ్యారేజ్‌ ఏర్పట్లలో బిజీగా ఉన్నానని తమ న్యాయవాది ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో బాంద్రా పోలీసుల ఎదుట ఈ నెల 1న హాజరు కావాలని పోలీసులు మరోసారి సమన్లు పంపించారు.