ప్రతీ సంవత్సరం మార్చి నెల అన్ సీజన్. ఈ సీజన్ లో సినిమాలు రిలీజ్ లు పెద్దగా పెట్టుకోరు. అడపా,దడపా ఏవో చిన్న సినిమాలు వస్తూంటాయి. అయితే ఇప్పుడు సీన్ వేరు. కరోనా తర్వాత వరస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సీజన్..అన్ సీజన్ అనే మాట లేదు. రిలీజ్ చేయటమే తమ లక్ష్యం అన్నట్లు ముందుకు సాగుతున్నారు. క్రితం శుక్రవారం పదకొండు సినిమాలు దాకా రిలీజ్ అయ్యాయి. ఈ గురువారం మహాశివరాత్రిని పురస్కరించుకుని గురువారమే సినిమాలు రిలిజ్ కు వచ్చేస్తున్నాయి. 

అయితే ఈ సినిమాల్లో ఎన్ని జనాల నాడిని పట్టుకుంటున్నాయి. ఎన్ని ఓపినింగ్స్ తెచ్చుకుంటున్నాయి అనేది ప్రశ్నార్దకమే. క్రితంవారం అలా చెప్పుకోదగ్గ సినిమా ఏదీ లేదు. కానీ ఈ వారం మాత్రం రెండు సినిమాలు వార్తల్లో నిలుస్తున్నాయి. వాటిల్లో ఒకటి జాతి రత్నాలు అయితే మరకొటి గాలి సంపత్. జాతి రత్నాలు సినిమా వెనక నవీన్ పొలిశెట్టి, నాగ్ అశ్విన్ ఉన్నారు. గాలి సంపత్ ప్రాజెక్టు వెనక అనీల్ రావిపూడి ఉన్నారు. దాంతో పోటీ ఈ రెండు సినిమాల మధ్యే అన్నట్లు ఉంది.

అయితే ఈ రెండింటిలో ఏ సినిమావైపు ఎక్కువ జనం మ్రొగ్గుచూపుతున్నారు అంటే జాతి రత్నాలు అనే చెప్పాలి. ఆ విషయం మనకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బజ్ ని బట్టి, అడ్వాన్స్ బుకింగ్ లును బట్టి ఉంటుంది.  ‘జాతిరత్నాలు’కు అడ్వాన్స్ బుకింగ్స్  ఓ రేంజిలో  జరుగుతున్నాయి. పెట్టిన టికెట్లు పెట్టినట్లే అయిపోతున్నాయి. షోలకు షోలు సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి. చిన్న సినిమాకు ఈ స్దాయిలో అడ్వాన్స్ బుక్కింగ్ లు ఎవరూ ఊహించలేదు. నాగ్ అశ్విన్ బ్రాండ్ నేమ్, ఫన్ తో కూడిన ట్రైలర్ , పోస్టర్స్ ఇందుకు కారణం అంటున్నారు.
 
  ‘పోలీసులు, చట్టాల పట్ల ఎలాంటి అవగాహన లేని ముగ్గురు అమాయక యువకుల కథ ఇది. ఓ పెద్ద నేరంలో చిక్కుకున్న వారు ఏ విధంగా బయటపడ్డారనే కథాంశంతో వినోదాన్ని పంచుతుంది’ అని అన్నారు అనుదీప్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘జాతిరత్నాలు’. నాగ్‌ అశ్విన్‌ నిర్మాత. ఈ నెల 11న విడుదలకానుంది. 

అనుదీప్‌ మాట్లాడుతూ.. ‘నా స్వస్థలం సంగారెడ్డి. అమీర్‌పేట్‌లో డిగ్రీ చేశాను. పదేళ్ల క్రితం లఘు చిత్రాలతో నా ప్రయాణం ఆరంభమైంది.    సమకాలీన అంశాలతో సాగే  సెటైరికల్‌ ఎంటర్‌టైనర్‌గా ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని తెరకెక్కించాం. సమాజంలో చోటుచేసుకుంటున్న వాస్తవాల్ని సీరియస్‌గా కాకుండా కామెడీ జోడించి ఈ సినిమాలో చెప్పాం.   జాతిరత్నాలుగా పిలవబడే  ముగ్గురు యువకులు  చేసే ప్రతి పని నుంచి బోలెడంత కామెడీ పుడుతుంది. 

నవీన్‌, రాహుల్‌రామకృష్ణ, ప్రియదర్శితో పాటు ప్రతి పాత్రకు సమ ప్రాధాన్యముంటుంది. నేను చేసిన ఓ షార్ట్‌ఫిల్మ్‌ నచ్చడంతో నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించారు. నాగ్‌ అశ్విన్‌లో ఎలాంటి భేషజాలు ఉండవు. నేను చెప్పింది పాటించాలనే ఒత్తిడిని తీసుకురాకుండా సినిమా రూపకల్పనలో అవసరమైన చక్కటి సలహాలిచ్చారు. దర్శకుడిగా ‘పిట్టగోడ’ నా మొదటి సినిమా. అనుకున్నంతగా ఆ సినిమా ఆడలేదు. మార్షల్‌ ఆర్ట్స్‌కు వినోదాన్ని జోడిస్తూ తదుపరి కథ రాసుకున్నా. వైజయంతీ మూవీస్‌లో ఆ సినిమా చేయబోతున్నా’ అని తెలిపారు.