`బవాల్‌` చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. ఇందులో `ఆష్విట్జ్` క్యాంపులను చూపించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.  తాజాగా హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ స్పందించారు. 

ఎన్టీఆర్‌తో `దేవర` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది హీరోయిన్‌ జాన్వీ కపూర్. త్వరలోనే తెలుగు హీరోయిన్ కాబోతున్న ఈ భామ హిందీలో `బవాల్‌` అనే సినిమాలో నటించింది. వరుణ్‌ ధావన్‌ హీరోగా నటించిన చిత్రమిది. నితీష్‌ తివారీ దర్శకత్వం వహించారు. రెండు ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. వరల్డ్ వార్‌ నేపథ్య మూవీ అంటే యాక్షన్‌, యుద్ధం అనే కోణంలో కాకుండా ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కించారు. గత శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు వివాదంగా మారుతుంది. 

`బవాల్‌` చిత్రంలోని కొన్ని సన్నివేశాలు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. ఇందులో `ఆష్విట్జ్` క్యాంపులను చూపించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. ఆష్విట్జ్ లోని పరిస్థితులను చూపిస్తూ సీన్లు ఉన్న నేపథ్యంలో దానిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమవుతుంది. ఈ సీన్లపై అభ్యంతరం తెలపడం పట్ల తాజాగా హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ స్పందించారు. సినిమాలోని అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలని, అది కాకుండా వేరే కోణంలో చూస్తే తాము ఏం చేయలేమన్నారు.

జాన్వీ చెబుతూ, ఇజ్రాయిల్‌ దేశస్థుడైన ఒక ప్రొఫేసర్‌ తనకు బాగా తెలుసు అని, అతడి పుర్వీకులు నాజీల నిర్భంధంలో ప్రాణాలు కోల్పోయారని, ఇటీవల ఆయన మా `బవాల్‌` సినిమా చూసి భావోద్వేగానికి గురైనట్టు చెప్పింది జాన్వీ. సినిమా పట్ల ఆయన ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ప్రేక్షకుల దృష్టి కోణంపైనే ఏదైనా ఆధారపడి ఉంటుందని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో జరిగిన అల్లకల్లోలాన్ని చూపించడమే తమ సినిమా ఉద్దేశ్యమని, ఒకవేళ మీరు మా ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే తాము ఏం చేయలేమని తెలిపింది జాన్వీ కపూర్‌. సినిమాలోని తన పాత్రని చూసి పలురువు విద్యార్థులు చలించిపోయారట.తన పాత్ర చూశాక వాళ్లకి ఒక ధైర్యం వచ్చిందని తనతో చెప్పారని, అది తనకెంతో గర్వంగా ఉందని చెప్పింది. 

సినిమాపై చిత్ర దర్శకుడు నితీష్‌ తివారీ కూడా స్పందించారు. `వివరణాత్మక విమర్శలు తీసుకోవడానికి నేనెప్పుడూ ముందుంటాన, గతంలో నేను తెరకెక్కించిన సినిమాలకూ ఇలాంటి విమర్శలే వచ్చాయని, `దంగల్‌` విడుదలైనప్పుడు ఆ తండ్రి ఎందుకు తన ఉద్దేశాలను పిల్లలపై రుద్దుతున్నాడు? అని అడిగారు. `బవాల్`లో ఎన్నో మంచి సందేశాలున్నాయి. వాటిని వదిలేసి, రెండు మూడు విషయాలపైనే హైలైట్‌ చేస్తూ సినిమాని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆష్విట్జ్ లో ఎదురైన పరిస్థితులు చూసి అజ్జూ, నిషా చలించిపోయినట్టు చూపించాను కదా, విమర్శలు చేసే వాళ్లు ఆ సన్నివేశాలను గుర్తించలేదా` అని ప్రశ్నించారు దర్శకుడు. 

ఆష్విట్జ్ ఏంటనేది చూస్తే, సెకండ్‌ వరల్డ్ వైడ్‌ సమయంలో జర్మన్‌ నాజీలు ఏర్పాటు చేసిన నిర్భంధ క్యాంపులను ఆష్విట్జ్ అంటారు. ఈ క్యాంపుల్లో యూదులను నిర్భంధించి చిత్ర హింసలు పెట్టేవారు. ఆష్విట్జ్ లో ఎంతో మందిప్రాణాలు కోల్పోయారు. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితులను తెలియజేస్తూ తెరకెక్కిన `బవాల్‌`లో ఆష్విట్జ్ క్యాంపులను చూపించడంపై పలువురు అభ్యంతరం తెలియజేస్తున్నారు. ఇది వివాదానికి కారణమవుతుంది.