పవన్ కళ్యాణ్ పై భౌతిక దాడి చేయాలని కుట్ర పన్నుతున్నారంటూ జనసేన పార్టీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జనసేన పార్టీ వర్గాలు ఈ మేరకు లెటర్ హెడ్ విడుదల చేశారు. కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ కదలికలపై ప్రత్యర్థులు నిఘా పెట్టినట్లు జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద దాడికి ప్రత్యర్ధులు కుట్ర పన్నుతున్నారన్న అంశం కలకలం రేపుతోంది. జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఈ మేరకు అధికారికంగా ఓ లెటర్ హెడ్ విడుదల చేశారు. ఆయన తన లేఖలో కీలక విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర జరుగుతుందని కేంద్రం నుండి మాకు సమాచారం ఉంది. వైజాగ్ లో దీన్ని అమలు చేయాలి అనుకున్నారు. లక్షల మంది అభిమానులు హాజరైన నేపథ్యంలో కుదరలేదు. గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ ఇల్లు, కార్యాలయాల వద్ద అనుమానితులు సంచరిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కదలికలు గమనిస్తున్నారు. కార్లలో, ద్విచక్ర వాహనాలపై పవన్ కళ్యాణ్ వాహనాన్ని అనుసరిస్తున్నారు. ఆయన వాహనాన్ని అనుసరిస్తున్నవారు ఖచ్చితంగా అభిమానులు కాదని వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. సోమవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు కారులో పవన్ ఇంటి వద్దకు వచ్చారు. పవన్ కళ్యాణ్ ని దుర్భాషలాడుతూ గొడవకు దిగారు. సెక్యూరిటీ వాళ్ళను అక్కడి నుండి పంపే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనలేక ఆయన్ని హత్య చేయాలని, అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారంటూ, నాదెండ్ల మనోహర్ లెటర్ లో పేర్కొన్నారు. ఈ క్రమంలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
జనసేన ఆరోపిస్తున్నట్లు నిజంగా పవన్ పై భౌతిక దాడులకు తెగబడే ప్రయత్నం జరుగుతుందా? ఇవి కేవలం నిరాధారమైన రాజకీయ ఆరోపణలేనా? అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూట్లో పాల్గొంటున్నారు. ఏపీ రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న పవన్ ఏక కాలంలో రెండు బాధ్యతలు నెరవేరుస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మరో 18 నెలల సమయం మాత్రమే ఉండగా హరి హర వీరమల్లు షూట్ కంప్లీట్ చేసి, మొత్తం సమయం రాజకీయాలకు కేటాయించనున్నారు. దీని కోసమే ఆయన భవదీయుడు భగత్ సింగ్ మూవీ సైతం పక్కన పట్టినట్లు తెలుస్తుంది.
