తన అభిమానుల విషయంలో పవన్ కళ్యాణ్ ప్రాణం పెడుతూంటారు. వారికి ఏ చిన్న కష్టం వచ్చిందని తెలిసినా వెంటనే తనకు చేతనైన సాయిం చేయటానికి ముందుకు వస్తారు. గతంలోనూ ఎన్నో సార్లు అభిమానులను ఆదకున్న పవన్ తాజాగా మరో అభిమానికి తనకు చేతనైన సాయిం జచేసి ప్రాణం నిలబెట్టడానికి ప్రయత్నించారు. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని పాతకూటి బుడిగయ్యను జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పరామర్శించి, ఆర్దిక సాయిం చేసారు.

వివరాల్లోకి వెళితే... ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం అన్నసముద్రం గ్రామానికి చెందిన బుడిగయ్య పవన్‌కు వీరాభిమాని. గత కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. కీమో థెరపీ తీసుకుంటూ కూడా జనసేన పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొంతకాలంగా మంచానికే పరిమితం అయ్యారు. పవన్‌ని చూడాలన్న తన కోరికను స్థానిక జనసేన నాయకులకు తెలపగా.. విషయం జనసేనాని దృష్టికి వచ్చింది. బుడిగయ్యను పరామర్శించేందుకు అన్నసముద్రం వస్తానని పవన్‌ చెప్పారు. 

ఈలోగా అతన్ని అంబులెన్సులో ప్రశాసన్‌నగర్‌లో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రి వైద్యులతో తాను స్వయంగా మాట్లాడుతానని పవన్‌ కుటుంబ సభ్యులకు తెలిపారు. బుడిగయ్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు చూడాలని ఎర్రగొండపాలెం నుంచి జనసేన అభ్యర్థిగా నిలిచిన వైద్యుడు గౌతమ్‌కు సూచించారు. 

ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో బుడిగయ్య, ఆయన కుటుంబ సభ్యులు పవన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ అతడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులను ఆరా తీశారు. వైద్య ఖర్చుల కోసం రూ.లక్ష ఆర్థిక సహాయం చేశారు. తన అభిమాని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు.