కథ-

వైజాగ్ లో మెకానిక్ షాప్ నడిపిస్తూ బతికే నరసింహ(బాలకృష్ణ)కు అన్యాయం జరిగితే అస్సలు సహించని తత్వం వుంటుంది. ఆ క్రమంలో వైజాగ్ లో ఎంపీ టికెట్ కోసం ఆశిస్తున్న పొలిటిషియన్ తోట రామిరెడ్డి కొడుకు రవిశంకర్ రెడ్డి తనకు ఎంపీ టికెట్ దక్కాలంటూ వైజాగ్ లో నడిరోడ్డుపై ధర్నాకు దిగుతాడు. ఈ ధర్నాతో సామాన్యులు అవస్థలు పడటమే కాక నిండు గర్భిణి మృతి చెందుతుంది. దీంతో నరసింహ రవిశంకర్ రెడ్డి గ్యాంగ్ ను చెదరగొడతాడు. ఇంతలో ఎంపీ టికెట్ వచ్చిందని ఫోన్ రావటంతో రవిశంకర్ రెడ్డి ఎంపీ అయ్యాక నీ సంగతి చూస్తానంటూ వార్నింగ్ ఇస్తాడు. అయితే... ఇంత నష్టపోయిన మనం వీన్ని ఎంపీగా గెలిపించడం న్యాయమా కాదా అనగానే అంతా బ్లాక్ అయిపోయిన రోడ్డు క్లియర్ చేయకుండా అలాగే వుంటారు. దీంతో ఎంపీ ఎన్నికలకు రవిశంకర్ రెడ్డి నామినేషన్ వేయకుండా సమయం అయిపోతుంది. అదంతా న్యూస్ లో రావటంతో పరువు పోయిందని భావించి పెళ్లి చేసుకోవాల్సిన రవి ఆత్మహత్య చేసుకుంటాడు. దాంతో నరసింహపై పగబట్టిన తోట రామిరెడ్డి అతని అనుచరులతో కలిసి నరసింహ దగ్గర పనిచేసే మంగ(హరిప్రియ) పెళ్లిలో నరసింహ స్నేహితులతోపాటు పలువురిని చంపేస్తాడు. దీంతో కోర్టు తోట రామిరెడ్డికి శిక్ష విధిస్తుంది. జైలుకు వెళ్లిన తోట రామిరెడ్డి పగతో రగిలిపోతుంటాడు. మరోవైపు తనకు చిన్నప్పటి నుంచి స్నేహితురాలైన మాస్టారు(ప్రకాశ్ రాజ్) కూతురు గౌరి, నరసింహ ప్రేమలో వుంటారు. అయితే గౌరి సుఖంగా వుండాలంటే మరిచిపోవాలని తన గురువు, గౌరి తండ్రయిన మాస్టారు ఆదేశించడంతో గౌరి సుఖంగా వుండాలంటె మంగను పెళ్లి చేసుకోవటం ఒక్కటే మార్గమని భావించిన నరసింహ అనుకున్నంత పని చేస్తాడు. మంగ గర్భిణిగా వున్నప్పుడే తోట రామిరెడ్డి యాక్సిడెంట్ చేయటంతో ఇద్దరు కవలపిల్లలను కని మంగ చనిపోతుంది. మరోవైపు గౌరికి కూడా పోలీస్ ఆఫీసర్ తో పెళ్లవుతుంది. మూడేళ్ల తర్వాత నరసింహ,గౌరి ఇద్దరు తమిళనాడులోని కుంభకోణంలో కలుస్తారు. మంగను పెళ్లి చేసుకున్నందుకు అసహ్యాంతో వెళ్లిపోయి వేరే అతన్ని పెళ్లి చేసుకున్న గౌరి తిరిగి నరసింహను ఎందుకు కలిసింది. నరసింహ గౌరి జీవితంలోకి మళ్లీ వచ్చాక ఏం జరిగింది. కుంభకోణంలో వున్న నరసింహ తోట రామిరెడ్డిని ఎలా అంతం చేశాడన్నదే మిగతా కథ.

 

విశ్లేషణ-

డైలాగులకు పెట్టింది పేరైన బాలయ్యకు ఫ్లాష్ బ్యాక్ స్టోరీలున్న సినిమాలను పండించటంతో మరెవ్వరూ సాటి రారని మరోసారి నిరూపించాడు. భార్య కోరిక మేరకు ప్రశాంతంగా కుంభకోణంలో బతుకుతున్న సింహాన్ని(నరసింహ) అక్కడి స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడ్డ గొడవలు మళ్లీ అతని ఉనికిని అందరికీ తెలిసేలా చేయటం, విలన్ తనను చంపాలనే కసితో భార్యను కూడా చంపేసి జైలు నుంచి బైటికి రావటం.. ఇలా పక్కా స్క్రిప్ట్ తో, ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామాను కథగా ఎంచుకున్న దర్శకుడు కె.యస్.రవికుమార్ ఫ్యామిలీ సెంటిమెంట్ పండించటంతో బాలయ్యకు మరోసారి జైసింహ రూపంలో హిట్ సినిమా దక్కిందని చెప్పాలి. ఈసారి బాలయ్య లుక్ కొత్తగా కనిపించడమే కాక డాన్సులు కూడా వెరైటీగా ట్రై చేసి మెప్పించాడు బాలయ్య. నయనతార తన సహజ నటనతో మెప్పించింది. నటాషా, హరిప్రియలు కూడా తమ పాత్రలకు సరైన రీతిలో న్యాయం చేశారు. బాలయ్య స్నేహితులుగా శివాజీరాజా అండ్ గ్యాంగ్ మెప్పించారు. గురువుగా, తండ్రిగా ప్రకాశ్ రాజ్ తన పాత్రకు విలక్షణ నటన జోడించాడు. బాహుబలి ప్రభాకర్ ఈసారి తమిళనాడులోని కుంభకోణంలో లోకల్ రౌడీ నాయకుడు మణియప్పన్ గా విలన్ పాత్రకు తనదైన నటనతో మెప్పించాడు. నేపథ్య సంగీతం కూడా సెంటిమెంట్ కు, డైలాగులకు తగ్గకుండా అలరించింది. పాటల్లో బాలయ్య స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య అంటేనే డైలాగ్స్.. ఈ సినిమాలో “నేను చదవలే. నాకు తెలిసిందింతే..” అంటూ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ రప్పిస్తుందంతే. ఇళాంటి డైలాగులకు జైసింహలో కొదువలేదు.

 

చివరగా-

జైసింహ సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి సరదాగా అంతా ఎంజాయ్ చేస్తారనటంలో ఎలాంటి సందేహం లేదు.