సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటిస్తున్నాడు. మహర్షి విజయం తర్వాత మహేష్ నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఈ చిత్రంతో లేడి సూపర్ స్టార్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు. 

జగపతి బాబు కూడా ఈ చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల జగపతి బాబు ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. దీనితో సరిలేరు నీ కెవ్వరు చిత్రంపై అనేక పుకార్లు వినిపించాయి. సినిమాకు డ్యామేజ్ జరిగేలా ఈ ఊహాగానాలు ఎక్కువవుతుండడంతో దర్శకుడు అనిల్ రావిపూడి, జగపతి బాబు సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. 

జగపతి బాబు మాట్లాడుతూ 'నా 33 ఏళ్ల సినీ కెరీర్ లో ఎప్పుడూ ఏ చిత్రం గురించి వివరణ ఇవ్వలేదు. చిత్ర పరిశ్రమ నా ఫ్యామిలీ లాంటిది. అందుకే ఎక్కువగా మాట్లాడను. కానీ ఒక విషయంలో తప్పనిసరిగా వివరణ ఇవ్వాల్సి వస్తోంది. సరిలేరు నీ కెవ్వరు చిత్రం నుంచి తాను తప్పుకున్నానని అనేక వార్తలు వస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ఆ చిత్రం నుంచి నేను తప్పుకోలేదు.. కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోతున్నానంతే. 

ఈ చిత్రం కోసం రెండు సినిమాలు కూడా వదులుకున్నా. కానీ చిత్ర పరిశ్రమలో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకే మహేష్ సినిమా చేయలేకపోతున్నా అని జగపతి బాబు తెలిపారు. పాత్ర చాలా బాగా నచ్చింది. 

అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సరిలేరు నీకెవ్వరు చిత్రంలో జగపతి బాబు నటించడం లేదు అని తెలిపారు. జగపతి బాబుకు ఈ చిత్రంలో నటించాలని ఉంది. కానీ మేమే దాన్ని సాధ్యం చేసుకోలేకపోయాం. భవిష్యత్తులో ఆయనతో కలసి పనిచేయాలనుకుంటున్నట్లు అనిల్ రావిపూడి తెలిపాడు.