జ్వరం అని నిరక్ష్యం వద్దు,మా కజిన్ చనిపోయారు: వెంకీ కుడుముల విజ్ఞప్తి
చాలా మంది దీన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. అలాంటి తప్పు చేయొద్దని అప్రమత్తం చేస్తున్నారు దర్శకుడు వెంకీ కుడుముల.

ఇప్పుడు చాలా చోట్ల జ్వరాలు కనపడుతున్నాయి. అయితే ఆ జ్వరం మామూలుదే అని లైట్ తీసుకుని సాధారణ టాబ్లెట్లు వేసుకుంటున్నారు చాలామంది.అయితే జ్వరాలను సీరియస్ గా తీసుకోవాలని, ఇది ప్రాణాలకే ముప్పుగా మారుతోందని హెచ్చరికతో కూడిన రిక్వెస్ట్ చేస్తున్నారు దర్శకుడు వెంకీ కుడుముల. తమ కుటుంబంలో జరిగింది ఎవరికీ జరగకూడదని భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను ఎక్స్ (ట్విటర్) లో షేర్ చేసారు.
ఆ పోస్ట్ లో ఏముంది అంటే...‘‘గత కొన్ని వారాలుగా మా కజిన్ తరచూ జ్వరంతో బాధపడుతున్నారు. సాధారణ జ్వరమేనని భావించి సరైన సమయంలో వైద్యుని వద్దకు వెళ్లి చికిత్స తీసుకోలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్ (మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం)కు దారి తీసింది. సరైన సమయంలో చికిత్స అందించి ఉంటే, అది నయం అయ్యేది. వైద్యుని దగ్గరికి వెళ్లకుండా ఆలస్యం చేయడం జీవితాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. మా కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. కొవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకోవద్దు. మన శరీరం సరైన స్థితిలో లేనప్పుడు త్వరగా జ్వరం బారిన పడతాం. అనారోగ్యానికి గురవుతాం. ఈ లక్షణాలను దయ చేసిన నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకోండి. ఏదైనా సమస్యగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. మనం తీసుకునే చిన్న చిన్న ఆరోగ్య జాగ్రత్తలే మన జీవితాల్ని కాపాడతాయి’’ అని అన్నారు.
ఇక వెంకీ కుడుముల కెరీర్ విషయానికి వస్తే... ‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో తనకంటూ ఓ మార్క్ , మంచి గుర్తింపు తెచ్చుకున్నారు వెంకీ కుడముల. ‘భీష్మ’ తర్వాత నితిన్ - రష్మిక కాంబోలో వెంకీ కుడుముల ఇటీవల ఓ సినిమా ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఇది రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఇది పట్టాలెక్కనుంది.