ఇండియన్ స్క్రీన్ పై భారీ బడ్జెట్ చిత్రాల తాకిడి ఎక్కువవుతోంది. సౌత్ ఇండియన్ చిత్రాలు దూసుకుపోతుంటే బాలీవుడ్ లో ఆ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. కానీ సూపర్ హీరో హృతిక్ రోషన్, యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ భారీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వార్' చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడానికి మాకు ఏడాది సమయం పట్టింది. సాధారణంగా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నాలుగు యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. కానీ ఈ చిత్రం 7 భారీ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించినట్లు సిద్దార్థ్ ఆనంద్ తెలిపారు. 

ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం నలుగురు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్స్ పనిచేసినట్లు సిద్దార్థ్ ఆనంద్ తెలిపారు. గేమ్ ఆఫ్ త్రోన్స్ ఫేమ్ పాల్ జెన్నింగ్స్, డెత్ రేస్ ఫేమ్ స్పిల్ హ్యూస్, ఏజ్ ఆఫ్ ఆల్ట్రోన్ ఫేమ్ సీ యంగ్ హో, టైగర్ జిందా హై ఫేమ్ పేర్వేర్జ్ షేక్ ఈ చిత్రానికి స్టంట్ డైరెక్టర్స్ గా పనిచేస్తున్నారు. 

ప్రేక్షకులకు యాక్షన్ ఎపిసోడ్స్ తో అద్భుతమైన అనుభూతి అందించేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు సిద్ధార్థ్ ఆనంద్ తెలిపారు. వాణి కపూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.