కమెడీయన్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగాడు సునీల్‌. ఒకానొక దశలో బ్రహ్మానందాన్ని మించిపోయాడు. బ్రహ్మీ టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేస్తున్న సమయంలో ఆయన ఫ్లోటింగ్‌ని తాను చేజించుకుని టాప్‌ కమెడీయిన్‌గా ఎదిగారు. తనకు ఆల్టర్‌ నేట్‌ లేదనేలా స్టార్‌ కమెడీయన్‌ రేంజ్‌కి వెళ్లి ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. అయితే మధ్య మధ్యలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. `అందాల రాముడు`తో హీరోగా మారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో `మర్యాద రామన్న`తో ఇక హీరోగా సెటిల్‌ అపోయితాడనే స్థాయికి ఎదిగిపోయాడు. 

అయితే హాస్యనటుడిగా రాణిస్తూనే హీరోగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక ఒకానొక సమయంలో పూర్తి హీరోగా మారిపోయాడు. కానీ సక్సెస్‌లు ఆయన్ని వరించలేదు. హీరోగా చేసిన ఒకటి రెండు సినిమాలు తప్ప మిగిలిన చిత్రాలన్నీ పరాజయం చెందడంతో తిరిగి హాస్యనటుడిగా మారారు. కానీ కమెడీయన్‌గా బిజీ కాలేకపోతున్నాడు. కొంత మంది దర్శకులు మాత్రమే ఆయన్ని అప్రోచ్‌ అవుతున్నారు. దీంతో తన కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది. 

ఈ నేపథ్యంలో తను విలన్‌గా మారబోతున్నట్టు తాజా పరిణామాలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే సునీల్‌ ఇటీవల రవితేజ హీరోగా రూపొందిన `డిస్కోరాజా`లో హాస్య నటుడిగా నటించి క్లైమాక్స్ లో విలన్‌ అవతారం ఎత్తాడు. సినిమాకే ట్విస్ట్ ఇచ్చారు. అయితే ఇదే సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. విలన్‌గా సునీల్‌ని ఊహించుకోలేకపోతున్నారు ఆడియెన్స్. 

ఈ క్రమంలో సునీల్‌ మరోసారి సాహసం చేస్తున్నాడు. హాస్యనటుడు సుహాన్‌ హీరోగా రూపొందుతున్న `కలర్‌ఫోటో`లో విలన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో పోలీస్‌ పాత్రలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా విడుదలైన టీజర్‌లో చివర్లో ఓ డైలాగ్‌తో తనది నెగటివ్‌ రోల్‌ అని తేల్చేశాడు. అయితే సునీల్‌ విలన్‌గా మారడంపై సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. సునీల్‌ రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నాడని కామెంట్‌ చేస్తున్నారు. మరి సునీల్‌ విలన్‌గా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.