తమిళ స్టార్ హీరో విజయ్ తాజా  సినిమా కు ఎన్టీఆర్ ప్రమోట్ చేసే అవకాసం ఉందంటూ మీడియాలో వినిపిస్తోంది.  ఎందుకంటే ఎన్టీఆర్ కు సన్నిహుతుడు, ఆయన పీఆర్వో అయిన మహేష్ కోనేరు తాజాగా విజయ్ చిత్రం ‘బిగిల్‌' తెలుగు రైట్స్ ని తీసుకుని భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్ నిమిత్తం ఎన్టీఆర్ ని సీన్ లోకి తేవాలని మహేష్ కోనేరు ఆలోచనగా చెప్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ పంక్షన్ ని తెలుగులోనూ భారీగా చేసే ఆలోచన ఉందని, దానికి ఎన్టీఆర్ వస్తాడని అంటున్నారు. అప్పుడు ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులతో సినిమాకు మంచి ఓపినింగ్స్ వచ్చే అవకాసం ఉంటుంది. దానితో పాటు నందమూరి అభిమానుల అండ కూడా కలుస్తుంది. విజయ్ కు ఇక్కడ కొద్దో గొప్పో మార్కెట్ ఉండనే ఉంది. ఇవన్నీ సినిమాకు ప్లస్ అవుతాయంటున్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే..హీరో విజయ్‌, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తమిళంలో రూపొందిన ‘తెరి’,‘మెర్సల్‌' చిత్రాలు ఘన విజయాల్ని సాధించాయి. వీరి కలయికలో రూపొందుతున్న తాజా చిత్రం ‘బిగిల్‌'.  విజిల్‌ని మద్రాసీ యాసలో బిగిల్‌ అంటారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఏజీయస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై కల్పాతి అఘోరామ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ కోనేరు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. దీపావళి సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం విడుదలకానుంది.

మహేష్‌ కోనేరు మాట్లాడుతూ ‘క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్న కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. విజయ్‌ పాత్ర భిన్న పార్శాలతో శక్తివంతంగా ఉంటుంది. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదలచేస్తుండటం ఆనందంగా ఉంది. త్వరలో తెలుగు టైటిల్‌ను ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, సినిమాటోగ్రఫీ:జి.కె.విష్ణు.