ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మెగా పవర్ స్టార్ రాంచరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. RC15 అనేది వర్కింగ్ టైటిల్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శంకర్ స్టైల్ లో అవినీతి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
ఇప్పటికి కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయింది. రాంచరణ్ ఈ చిత్రంలో సివిల్ సర్వీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్ వినిపిస్తోంది. అందుతున్న సమాచారం మేరకు చిత్ర యూనిట్ 'సర్కారోడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు చెబుతున్నారు. రాంచరణ్ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తున్నాడు.
ఒకటి సివిల్ సర్వీస్ ఆఫీసర్ కాగా మరొకటి ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రోల్. ఫ్లాష్ బ్యాక్ లో రాంచరణ్ రెట్రో లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. 'సర్కారోడు' అనే టైటిల్ కథకి యాప్ట్ గా ఉండడంతో చిత్ర యూనిట్ ఆల్మోస్ట్ దీనినే ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు.
ఈనెల 27న రాంచరణ్ పుట్టినరోజు. చరణ్ బర్త్ డే సందర్భంగా టైటిల్ లోగో కానీ, ఫస్ట్ లుక్ కానీ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న 50 వ చిత్రం కావడంతో దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
శంకర్ సినిమాల్లో ఉండే కళ్ళు చెదిరే పోరాట సన్నివేశాలు, కట్టిపడేసే డ్రామా ఈ చిత్రంలో కూడా ఉండనున్నాయి. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీత దర్శకుడు.
ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశం మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం ఇది. ఈ మూవీలో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
