ఆరేళ్ల త‌ర్వాత అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని చిత్రంతో ఇలియానా టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.  ఆమెను సినిమాలో చూసిన వాళ్లు కాస్త ఒళ్లు చేసిందన్నారు కానీ గ్లామర్ మాత్రం అలాగే ఉందన్నారు. దాంతో బోయపాటి శ్రీను దృష్టి ఆమెపై పడింది. సరదాగా తన సినిమాలో ఓ ఐటం సాంగ్ చేయిస్తే అనే ఆలోచన వచ్చింది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు బోయపాటి తలుచుకుంటే సాధ్యం కానిది ఏముంది. వెంటనే రామ్ చరణ్ కు ఆ ఐడియా చెప్పటం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. అయితే ఇక్కడే ట్విస్ట్ పడింది. 

ఈ స్పెషల్ సాంగ్ కోసం ఇలియానాని సంప్ర‌దిస్తే ఒక్క‌పాట‌కి ఇలియానా అడిగిన పారితోషికం అక్షరాలా అరవై ల‌క్ష‌ల రూపాయ‌ల‌ట‌. దీంతో షాక్ అయిన  నిర్మాత‌లు...రామ్ చరణ్ తో ఈ మాటే చెప్పారట. రామ్ చరణ్ సైతం ఇలా ఇలియానా ఈ స్దాయిలో డిమాండ్ చేస్తుందని ఊహించలేదు. స్టార్ హీరో సినిమాకి కూడా ఇలియానా ఇంత డిమాండ్ చేయ‌డ‌మేంట‌ని అనుకున్నారు. కానీ చేసిందేమింది. వేరే వాళ్లతో ఆ సాంగ్ పూర్తి చేయాలనే ఆలోచ‌న‌లో టీమ్ ఉన్న‌ట్టు తెలుస్తుంది. 

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న 12వ చిత్రంగా బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న  యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. విన‌య విధేయ రామ అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చ‌ర‌ణ్ పూర్తి మాస్‌ లుక్‌లో క‌నిపించ‌నున్నాడు. రీసెంట్ గా చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దానయ్య డీవీవీ నిర్మిస్తున్నారు.

సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. భ‌ర‌త్ అనే నేను చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కైరా అద్వానీ ఈ చిత్రంలో  హీరోయిన్ గా న‌టిస్తుంది. స్నేహ ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు . చరణ్ అన్న పాత్రల్లో  తమిళ హీరో ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), నవీన్‌ చంద్ర లు నటిస్తున్నారు.