Naseeruddin Shah: ఆ సినిమాల్లో ఏముంది... ఆర్ ఆర్ ఆర్, పుష్ప చూడలేకపోయాను!
సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సినిమాలు పూర్తిగా చూడలేకపోయానంటూ తక్కువ చేసి మాట్లాడారు.

బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా టాలీవుడ్ కి చెందిన రెండు సక్సెస్ఫుల్ చిత్రాలపై చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. థ్రిల్ చేసే అంశాలు తప్పితే ఆ సినిమాల్లో ఏముందని ఆయన అన్నారు. ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాలను నేను పూర్తిగా చూడలేకపోయాను. నాకు నచ్చలేదని చెప్పాడు. అయితే మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని నేను పూర్తిగా చూడగలిగాను... అన్నారు. మణిరత్నం గొప్ప ఫిల్మ్ మేకర్స్. ఆయన సినిమాలు ఎలాంటి ఎజెండా, ప్రోపగాండా లేకుండా రూపొందిస్తారని షా అన్నారు.
ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాల్లో పురుషుల కండలు, ఆధిపత్యం మాత్రమే కనిపించింది. ఆర్ ఆర్ ఆర్ సినిమాను మహిళా ప్రేక్షకులు ఇష్టపడతారని నేను అనుకోను అన్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రాన్ని ఇండైరెక్ట్ గా ప్రాపగాండా మూవీ అని ఆయన అన్నట్లుగా ఉంది. గతంలో ది కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీస్ చిత్రాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ చిత్రాలకు పూర్తి భిన్నంగా కమర్షియల్ కోణంలో ఆర్ ఆర్ ఆర్, పుష్ప తెరకెక్కాయి. మరి వీటిని నసీరుద్దీన్ షా వ్యతిరేకించడం వెనుక కారణం ఏమిటో అర్థం కాలేదు.
అదే సమాయంలో యంగ్ ఫిల్మ్ మేకర్స్ పై ఆయన ప్రశంసలు కురిపించారు. రామ్ ప్రసాద్ కి తెహ్ర్వి, గుల్మోహర్ వంటి చిత్రాలకు సరైన గౌరవం దక్కాలన్నారు. పుష్ప ఇండియా వైడ్ అత్యంత ఆదరణ దక్కించుకోగా... ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ తో పాటు పలు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. స్టీఫెన్ స్పీల్బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి ప్రముఖులు ఆర్ ఆర్ ఆర్ పై ప్రశంసలు కురిపించారు. నసీరుద్దీన్ మాత్రం అవి చెత్త సినిమాలు అన్నట్లు కొట్టిపారేశారు.
గొప్ప నటుడిగా పేరుగాంచిన నసీరుద్దీన్ షా మూడు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్నారు. 1987లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆర్ ఆర్ ఆర్, పుష్ప చిత్రాలపై నసీరుద్దీన్ షా కామెంట్స్ వైరల్ కాగా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది...