120 కోట్లలో శేఖర్ కమ్ములకు ఎంత ఇస్తారో
కోలివుడ్ స్టార్ హీరో ధనుష్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో ఓ త్రిభాష చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. దినికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం వెల్లడైంది.
ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తంత్రం’ శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యిన సంగతి తెలిసిందే. ఇందులో ధనుష్ మాస్ గ్యాంగ్‌స్టర్ లుక్‌లో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ కోలీవుడ్ స్టార్ స్ట్రెయిట్ గా తెలుగులో చేయనున్న కొత్త ప్రాజెక్ట్ ఖరారు చేసారు. క్లాసిక్ ప్రేమకథా చిత్రాలకు టాలీవుడ్‌లో కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు.
ధనుష్ కూడా ఈ చిత్రం గురించి చాలా ఆసక్తిగా ఉన్నారు. తాను ఆరాధించే దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరని, ఆయనతో కలిసి పని చేయడం ఎగ్జైటింగ్ గా ఉందని తెలుపుతూ ఇటీవలే ట్వీట్ కూడా చేశారు. ఈ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచి రకరకాల రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా బడ్జెట్ గురించి వార్తలు మొదలయ్యాయి. శేఖర్ కమ్ముల-ధనుష్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమా కోసం నిర్మాతలు దాదాపు 120 కోట్లు బడ్జెట్ కేటాయించనున్నారని అంటున్నారు. అంటే శేఖర్ కమ్ముల రెమ్యునేషన్ కూడా బాగా పెరగనుందన్నమాట.
ఇదే నిజమైతే శేఖర్ కమ్ముల ఫస్ట్ భారీ బడ్జెట్ మూవీ ఇదే అవుతుంది.శేఖర్ కమ్ముల ఇంతకుముందు వరకూ తెరకెక్కించిన చిత్రాలన్నీ తక్కువ బడ్జెట్ లేదా మిడ్ రేంజ్ బడ్జెట్ లోవే. అయితే ఈసారి హీరో ధనుష్, అంతేకాకుండా ఇది త్రిభాషా చిత్రం కావడంతో ఈ వార్తలు నిజమేనని అన్పిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి నారాయణ్ దాస్ నారంగ్, రామ్మోహన్‌రావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ప్రస్తుతం ధనుష్ చేతిలో ‘అత్రాంగి రే’, ‘ది గ్రే మ్యాన్’ ప్రాజెక్టులున్నాయి. సెకండ్‌వేవ్ కారణంగా వాయిదా పడిన ఆ సినిమా షూటింగ్స్ తిరిగి త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. మరోవైపు, శేఖర్‌కమ్ముల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘లవ్‌స్టోరీ’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘లవ్‌స్టోరీ’ విడుదల తర్వాత శేఖర్‌కమ్ముల-ధనుష్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.