కొద్దిరోజులుగా బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తుంది. హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ ని కుటుంబ సభ్యులు ఇబ్బంది పెడుతున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి. నటి కంగనా రనౌత్ సోదరి రంగోలి ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించింది.

సునైనా.. కంగనా సాయం కోరుతుందని రంగోలి తెలిపింది. ఈ క్రమంలో సునైనా మీడియా ముందుకు వచ్చి గొడవపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. గతేడాది తనకు ఢిల్లీకి చెందిన ఓ ముస్లిం వ్యక్తితో పరిచయమైందని, అతడిని ఇష్టపడినట్లు వెల్లడించింది. కానీ ఇంట్లో వారు ఒప్పుకోకపోవడం లేదని, జీవితాన్ని నరకం చేస్తున్నారని, భరించలేకపోతున్నానని ఆరోపణలు చేసింది.

తను ప్రేమించిన వ్యక్తిని కలవనివ్వడం లేదని, తనకు మాత్రం అతడితోనే ఉండాలనుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ విషయాలను కంగనా ద్వారా బయటపెట్టాల్సిన అవసరం ఏంటని విలేకరి ప్రశ్నించగా.. కంగనా మహిళా సాధికారతకు నిదర్శనమని, ఆపదలో ఉన్న మహిళలను వెంటనే ఆడుకోవాలనుకుంటారని తెలిపింది.

హృతిక్, కంగనాల మధ్య ఏం జరిగిందో తనకు తెలియదని, కానీ అతడి కారణంగా కంగనా బాధ పడిందని, న్యాయం కోసం పోరాడుతుందని, తన విషయంలో కూడా అదే జరుగుతోందని చెప్పింది. ప్రస్తుతం తను ఉన్న పరిస్థితుల్లో కంగనా తప్ప ఎవరూ సాయం చేయలేరనిపించిందని, అందుకే సంప్రదించినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ వివాదం  గురించి హృతిక్ రోషన్ కానీ, అతడి తండ్రి రాకేశ్ కానీ ఇంకా స్పందించలేదు.