సన్నివేశాల్లో దర్శకులు లాజిక్ మిస్ అయితే విమర్శలపాలు కావాల్సి వస్తుంది. అయితే దర్శకుడు సుకుమార్ ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్. పొరపాటున కూడా తన సినిమాలలో లాజిక్ మిస్ కాకుండా చూసుకుంటారు. 

సినిమా అంటే లాజిక్ లేని మ్యాజిక్. ఇక తెలుగు సినిమాల గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరో సినిమాలకు భౌతిక సూత్రాలు వర్తించవు. ఒంటి చేత్తో కొడితే పది మంది గాలిలో ఎగరడం, కాలితో సుమోలు ఆపడం వెరీ కామన్. వీటిపై సోషల్ మీడియాలో వందల కొద్ది మీమ్స్ చక్కర్లు కొడతాయి. అయితే ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కల్పించడానికి, హీరోని ఎలివేట్ చేయడానికి ఇవన్నీ అవసరం. ప్రేక్షకులు కోరుకునేది కూడా అదే కాబట్టి.. మరీ సినిమాను లెక్కలు వేసి చూడకుండా.. మనకు మంచి ఎక్సపీరియెన్స్ ఇచ్చిందా లేదా అనేది మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఫైట్స్, యాక్షన్ సన్నివేశాల్లో ప్రేక్షకులు లాజిక్ కోరుకోరు. 

  కానీ సన్నివేశాల్లో మాత్రం లాజిక్ ఉండాల్సిందే. సన్నివేశాల్లో దర్శకులు లాజిక్ మిస్ అయితే విమర్శలపాలు కావాల్సి వస్తుంది. అయితే దర్శకుడు సుకుమార్ ఈ విషయంలో చాలా పర్ఫెక్ట్. పొరపాటున కూడా తన సినిమాలలో లాజిక్ మిస్ కాకుండా చూసుకుంటారు. స్వతహాగా లెక్కల మాష్టారైన సుకుమార్ (Sukumar)సినిమాల్లో లాజిక్ లేకుండా సన్నివేశాలు తెరకెక్కిన సందర్భాలు చాలా తక్కువ. 

అయితే సుకుమార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ పుష్ప (Pushpa)మూవీలో ఆయన చేసిన ఓ మిస్టేక్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ పేలుతున్నాయి. విషయంలోకి వెళితే.. స్మగ్లర్ కొండారెడ్డికి చెందిన ఎర్రచందనం సరుకు పోలీసులకు దొరక్కుండా పుష్ప కాపాడతాడు. సరుకు దాచాడని తెలుసుకున్న పోలీసులు పుష్పను అరెస్ట్ చేస్తారు. పోలీసులు ఎంత కొట్టినా పుష్ప సరుకు ఎక్కడ దాచాడనేది చెప్పడు. 

పుష్పను బెయిల్ పై విడుదల చేసిన కొండా రెడ్డి కొడుకు సరుకు ఎక్కడ ఉందో చెప్పాలంటాడు. పుష్ప ఐదు లక్షలు ఇస్తే చెప్తా అంటాడు. డీల్ ప్రకారం సరుకు దాచిన చోటు చెప్పి పుష్ప ఐదు లక్షలు తీసుకుంటాడు. ఈ సీన్ లో పుష్ప తో పాటు పుష్ప అసిస్టెంట్ కేశవను కొండా రెడ్డి కొడుకు కారులో అడివికి తీసుకెళ్తాడు. మొదటిసారి కారెక్కిన పుష్ప, కేశవలు డోర్ తీసుకొని బయటికి రావడానికి ఇబ్బంది పడతారు. 

సరుకు అడ్రెస్ చెప్పాక... పుష్ప(Allu Arjun), కేశవలను అక్కడే వదిలేసి కొండా రెడ్డి కొడుకు కారులో వెళ్ళిపోతాడు. తన కారులో ఎక్కడం కుదరదు, ఆటోలో రండి అంటూ.. అవమానకరంగా మాట్లాడతాడు. దానికి హర్ట్ అయిన పుష్ప... కొండా రెడ్డి కొడుకు ఇచ్చిన ఐదు లక్షలతో కారు కొనుక్కురా.. నేను కారులోనే ఇంటికి వస్తానని పట్టుబడతాడు. కేశవ కొత్త కారు కొనుక్కొని స్వయంగా నడుపుకుంటూ... పుష్ప దగ్గరకు వస్తాడు. ఈ సన్నివేశంలో సుకుమార్ పుష్ప, కేశవకు అసలు కారు గురించి ఏమీ తెలియదు, వాళ్ళు మొదటిసారి కారు ఎక్కినట్లు చూపించాడు. లాజిక్ మర్చిపోయిన సుకుమార్ కాసేపటికే కేశవ స్వయంగా కారు నడుపుతున్నట్లు చూపించారు. 

కారు డోరు కూడా తీయడం రాని కేశవ... గంటల వ్యవధిలో కారు ఎలా నేర్చుకున్నాడు? స్వయంగా ఎలా నడుపుకుంటూ వచ్చాడు? సుకుమార్ ఈ  చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావ్? అంటూ మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. మరి ఇంత పెద్ద సినిమాలో చిన్న చిన్న లాజిక్స్ మిస్ కావడం, మిస్టేక్స్ జరగడం కామనే. సృజనాత్మకంగా ఆలోచించి అవన్నీ వదిలేయాలి.