రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న `దిశః ఎన్‌కౌంటర్‌` సినిమాకి మరో అడ్డంకి ఏర్పడింది. తాజాగా దర్శకుడు వర్మకి  హైకోర్ట్ నోటీసులు పంపించింది. గతేడాది నవంబర్‌ 26న షాద్‌ నగర్‌లో  దిశపై జరిగిన సామూహిక హత్యాచారం, హత్య ఘటనని ఆధారంగా చేసుకుని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ `దిశః ఎన్‌కౌంటర్‌` చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాని ఈ నెల 26న విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఆపేయాలంటూ దిశ తండ్రి హైకోర్ట్ ని ఆశ్రయించారు. దిశ తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌ని హైకోర్ట్ సోమవారం విచారణ జరిపింది. సెన్సార్‌ బోర్డ్ నిర్ణయం తీసుకోక ముందే కోర్ట్ ని ఎందుకు ఆశ్రయించారని హైకోర్ట్ ఈ సందర్భంగా ప్రశ్నించింది. సామాజిక మాధ్యమాల్లో ట్రైలర్‌ని విడుదల చేస్తున్నారన్న పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రామ్‌గోపాల్‌ వర్మకి హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. 

అలాగే సినిమా తీసేందుకు అనుమతులున్నాయో లేదో తెలుసుకుని చెప్పాలంటూ అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ని కోర్ట్ ఆదేశించింది. దీంతోపాటు ఈ పిటిషన్‌పై కౌంటర్లు దాఖలు చేయాల్సిందిగా సెన్సార్‌ బోర్డ్, రాష్ట్ర ప్రభుత్వానికి సైతం హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్మ తీసిన మరో సినిమాకి అడ్డంకి ఎదురైంది. ఇప్పటికే ఆయన రూపొందించిన `మర్డర్‌` చిత్రానికి కోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. పేర్లు, ప్రాంతాలు వాడకుండా విడుదలకు ఓకే చెప్పింది.