సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ముప్పై ఏళ్లు దాటిపోతున్నా పెళ్లి ఊసెత్తడం లేదు. ఈ మధ్య కాలంలో కొంతమంది బాలీవుడ్ ముద్దుగుమ్మలుపెళ్లి చేసుకున్నప్పటికీ.. సౌత్ హీరోయిన్లు మాత్రం పెళ్లి అంటే అప్పుడేనా..? అని అంటున్నారు. నటి త్రిష కూడా తాజాగా పెళ్లిపై కొన్ని కామెంట్స్ చేసింది.

నిజానికి ఈపాటికే త్రిషకి పెళ్లి జరగాల్సివుంది. వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో ప్రేమలో పడి నిశ్చితార్ధం కూడా చేసుకుంది. మరికొద్దిరోజుల్లో పెళ్లి అనగా.. ఎంగేజ్మెంట్ బ్రేకప్ చేసుకుంది. ఆ తరువాత మళ్లీ సినిమాలతో బిజీ అయిపొయింది. '96' సినిమాతో పెద్ద హిట్ ని దక్కించుకుంది. రజినీకాంత్ 'పేటా' సినిమాలో కూడా నటించింది.

తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది త్రిష. ఏ విషయాన్నైనా.. సూటిగా మాట్లాడేలా ఉండాలని, అందంతో తనకు పని లేదని, బాగా చూసుకునేవాడైతే చాలని అంటోంది. కలర్ తో పెద్దగా సంబంధం లేదని, తనకు కాబోయే వాడు నల్లగా ఉన్నా పర్వాలేదని చెప్పింది.

ఇంట్లో చూపించిన వాడిని మాత్రం చచ్చినా చేసుకోనని తెగేసి చెప్పేసింది. కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటానని స్పష్టం చేసింది. ఈ మధ్యకాలంలో త్రిష ఓ ఫారెన్ వ్యక్తితో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అమ్మడు మాటలు వింటుంటే అది నిజమే అనిపిస్తోంది.