టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ కౌర్ పెళ్ళికి సిద్ధమయ్యారు. త్వరలో ఆమె నిశ్చితార్ధం ఘనంగా జరగనుంది. ఈ మేరకు మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఏడాది కాలంగా టాలీవుడ్ లో చాలా మంది నటీనటులు పెళ్లి పీటలు ఎక్కారు. రానా, నితిన్, నిఖిల్ మరియు నిహారిక పెళ్లి చేసుకోవడం జరిగింది. తాజాగా ఈ లిస్ట్ లో మెహ్రీన్ చేరనున్నట్లు తెలుస్తుంది. 

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ వివాహం జరగనుందని సమాచారం.వీరిద్దరూ చాలాకాలంగా ప్రేమలో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. అందుతున్న వార్తల ప్రకారం మెహ్రీన్-భవ్య బిష్ణోయ్ ల నిశ్చితార్థం ఈ రోజు జరగనుంది.  జైపూర్ లోని ఆలిలా ఫోర్ట్ లో జరుగుతున్న నిశ్చితార్థ వేడుకకు కేవలం బంధువులు, సన్నిహితులు హాజరుకానున్నారట.  బిష్ణోయ్ తండ్రి కుల్దీప్ ఆధమ్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

వరుస పరాజయాల నేపథ్యంలో మెహ్రీన్ కి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. నాగశౌర్య హీరోగా వచ్చిన అశ్వద్ధామ మెహ్రీన్ చివరి చిత్రం. అయితే స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మెహ్రీన్ ఎఫ్ 3 మూవీ చేస్తున్నారు. గతంలో ఆమె నటించిన ఎఫ్ 2కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మరోమారు వరుణ్ కి జంటగా మెహ్రీన్ కనిపించనున్నారు.