ఒకప్పుడు కీర్తి సురేష్ తన ఎత్తుకు తగ్గ బరువు, లావుతో ముచ్చటగా ఉండేవారు. అయితే ఆమె మహానటి సినిమా కోసం కొంచెం బరువు పెరిగారు. మహానటి సావిత్రి తన చివరి రోజుల్లో బొద్దుగా ఉన్నారు. పాత్రలో పర్ఫెక్షన్ కోసం, సహజంగా కనిపించడానికి కీర్తి సురేష్ సైతం డైరెక్టర్ కోరిక మేరకు లావుగా మారడం జరిగింది. ఆ సినిమా కీర్తికి ఎనలేని కీర్తి తెచ్చిపెట్టింది. 


అయితే మూవీ కోసం వైయిట్ పెరగడం కీర్తి సమస్యగా భావించింది. ఏడాది కాలంగా కీర్తి బరువు తగ్గే పనిలో నిమగ్నమై ఉన్నారు. క్రమంగా కీర్తి మునుపటి బరువును కూడా కోల్పోయి చాలా సన్నగా మారారు. సన్నబడ్డాక కీర్తి సురేష్ ముఖంలో గ్లామర్ తగ్గింది. గతంలో మాదిరి కీర్తి గ్లామరస్ గా కనిపించడం లేదు. బొద్దుగా ముద్దొచ్చే కీర్తి సురేష్ ఇంత సన్నగా మారడం ఏమీ బాగోలేదని ఫ్యాన్స్ సైతం పెదవి విరుస్తున్నారు. 


ఇక చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి స్టార్స్ సరసన క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ కి జంటగా ఆమె సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్నారు. ఇప్పటికే సర్కారు వారి పాట షూటింగ్ మొదలైంది. వచ్చే ఏడాది జనవరి కానుకగా సర్కారు వారి పాట విడుదల కానుంది. దర్శకుడు పరుశురాం ఓ వినూత్నమైన సబ్జెక్టుతో సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.