సౌత్‌ ఇండస్ట్రీలో కేవలం హీరోగానే కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌, నడిగర్‌ సంఘం నేతగా పాపులర్‌ అయిన నటుడు విశాల్‌. తన బ్యానర్‌లో వరుసగా సినిమాలను రూపొందించే ఈ స్టార్ హీరో నిర్మాణ సంస్థలో భారీ మోసం బయటపడింది. ఎన్నో ఏళ్లుగా నిర్మాణరంగంలో ఉన్న విశాల్‌ సంస్థలో మోసం జరిగినట్టుగా వార్తలు రావటంతో అభిమానులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

ఇటీవల హీరో విశాల్‌తో పాటు ప్రొడక్షన్‌ మేనేజర్‌ హరిలు సంస్థ లావాదేవిలను ఆడిట్‌ చేశారు. అయితే సందర్భంగా కంపెనీలో ఆరేళ్లుగా జరుగుతున్న ఓ భారీ మోసం బయటపడింది. గత ఆరు సంవత్సరాలుగా తమ కంపెనీలో పనిచేస్తున్న ఓ మహిళ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఎంప్లాయిస్‌కు సంబంధించిన టీడీఎస్‌ ఎమౌంట్‌ను తన వ్యక్తిగత ఎకౌంట్‌లోకి బదిలీ చేసుకుంది. ఈ మొత్తం 45 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

మేనేజర్‌ చెప్పిన వివరాల ప్రకారం గత నెల జూన్‌ 28న అకౌంటెంట్‌ ఇన్‌కంట్యాక్స్ పే చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆమె టీడీఎస్‌ కూడా చెల్లించలేదు. ఈ విషయం విశాల్‌ దృష్టికి వెళ్లటంతో వెంటనే చర్యలు తీసుకున్నాడు. ఈ మేరకు చెన్నైలోని విరుగంపక్కం పోలీస్‌ స్టేషన్‌లో మేనేజర్‌ హరి ఫిర్యాదు చేశాడు. ఈ వార్తలతో అభిమానులు షాక్‌ అయ్యారు. విశాల్ బ్యానర్‌లో ప్రస్తుతం చక్ర, తుప్పరివాలన్‌  2 సినిమాలను నిర్మిస్తున్నారు.