తమిళ రాజకీయాలలో వేడి మొదలైంది. ఎన్నికలకు కొన్నినెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అస్త్ర శస్త్రాలతో సిద్ధం అవుతున్నాయి. మరో వైపు కోలీవుడ్ తారల పొలిటికల్ ఎంట్రీపై కథనాలు వెలువడుతున్నాయి. కొందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ వారు రాజకీయాలలోకి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. ముఖ్యంగా తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు రాగా ఆయన తండ్రి వీటిని ఖండించారు. 

రజనీకాంత్ ఇప్పటికే రాజకీయాలలోకి వస్తానని ప్రకటించినప్పటికీ పార్టీ ప్రకటించడం కానీ, 2021 ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు కానీ స్పష్టత ఇవ్వలేదు. ఈ మధ్యనే ఆయన ఫ్యాన్స్ ఇదే విషయమై ఇంటి ముందు ధర్నాకు దిగారు. కాగా మరో ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్యపై కూడా ఫ్యాన్స్ ఒత్తిడి ఉంది. అనేక సేవా కార్యక్రమాలతో పాటు, పేదప్రజల కోసం స్కూల్ నడుపుతున్న సూర్యపై తమిళ ప్రజలలో మంచి విశ్వాసం ఉంది. 

ఈ నేపథ్యంలో సూర్య పాలిటిక్స్ లోకి  వస్తున్నారని తమిళ మీడియాలో కథనాలు రావడం జరిగింది. ఈ వార్తలకు హీరో సూర్య వివరణ ఇచ్చారు. తనకు రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దీనితో ఊహాగానాలకు తెరదించినట్లు అయ్యింది. 

ఆయన లేటెస్ట్ మూవీ సురారై పోట్రు విడుదలకు సిద్ధంగా ఉంది. డెక్కన్ ఎయిర్ వేస్ ఫౌండర్ గోపినాధ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రైమ్ లో విడుదల కానుంది. లేడీ డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో ఆకాశం నీ హద్దురా పేరుతో విడుదల అవుతుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక రోల్ చేశారు.