Asianet News TeluguAsianet News Telugu

ఎంత దూరం వెళ్తానో తెలియదు, ఈ ప్రయాణం మావయ్యకి అంకితం.. సూపర్‌స్టార్‌ కృష్ణని తలుచుకుని సుధీర్‌బాబు ఎమోషనల్

సూపర్‌ కృష్ణని తలుచుకున్నారు హీరో సుధీర్‌బాబు. మామయ్య లేకుండా విడుదలవుతున్న తన తొలి సినిమా `హంట్‌` అని, ఆయనకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్టు తెలిపారు.

hero sudheer babu emotional comments on superstar krishna hunt movie dedicate to him
Author
First Published Jan 23, 2023, 3:26 PM IST

గతేడాది చివర్లో సూపర్‌ స్టార్‌ కృష్ణ హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు హీరో సుధీర్‌బాబు. ఆయన లేకుండా రిలీజ్‌ అవుతున్న తన తొలి సినిమా `హంట్‌` అని, ఆయన లేకపోవడం చాలా వెలితిగా ఉందని అన్నారు. అంతేకాదు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు సుధీర్‌బాబు. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో సుధీర్‌బాబుతోపాటు `హంట్‌`టీమ్‌ పాల్గొంది. సినిమా గురించి అనేక విషయాలను పంచుకున్నారు. 

ఇందులో హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ, నా ప్రతి సినిమా విడుదలయ్యాక మార్నింగ్‌ షో తర్వాత సూపర్‌ స్టార్‌ కృష్ణ నుంచి నాకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చేది. ఇప్పుడు నేను అది మిస్‌ అవుతున్నా. కృష్ణ వేల తారల్లో ఒకరిగా వెలిగిన సూర్యుడు. ఆయన కాగడాన్ని వెలిగించి వెళ్లిపోయారు. ఇప్పుడు దాన్ని పట్టుకుని నడవాల్సిన బాధ్యత మా కుటుంబానిది. మనందరిది. నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు వెళ్లనివ్వాలా?, వద్దా? అని ఇంట్లో అందరికి కన్‌ఫ్యూజన్‌, కొందరు వద్దని ముఖం మీదే చెప్పేశారు. కొందరు హింట్‌ ఇచ్చారు. ఆ సమయంలో కృష్ణగారు ఒక్క మాట అన్నారు, కష్టపడితే సక్సెస్‌ అవుతాడు. చెయ్యనివ్వండి` అని భరోసా ఇచ్చారు. 

`అప్పట్నుంచి అప్పటి నుంచి నా లైఫ్ టర్న్ తీసుకుంది. మంచి వ్యాల్యూ వచ్చింది, రెస్పాక్ట్ వచ్చింది. ఇప్పుడు నా జీవితానికి అర్థం వచ్చింది. మంచి సినిమాలు చేశా. తెలుగు సినిమాల్లో నిలబడిపోయే కొన్ని సినిమాలు చేశా. ఇప్పుడు నా కెరీర్ స్టేబుల్ గా ఉందని ఈ మాట చెప్పడం లేదు. కృష్ణ గారు చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారు. ముందు నేను నమ్మలేదు. ఇంటికి వెళ్లిన తర్వాత 'నిజంగా అన్నారా?' అని అడిగా. అవునని చెప్పారు. వందల సినిమాలు చేసిన సూపర్ స్టార్ నా సినిమాలు చూడాలని ఎంచుకోవడం కంటే ఏం కావాలి. ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మల ఆయనకు రుణపడి ఉంటాను` అని అన్నారు సుధీర్‌బాబు. 

ఇంకా ఆయన మాట్లాడుతూ, కృష్ణ నాకు జ్ఞాపకాలు మాత్రమే ఇచ్చి వెళ్ళలేదు, ఆయనలో ధైర్యాన్ని కూడా ఇచ్చి వెళ్ళారు. ఆయన ఎవరూ చేయని ప్రయోగాలు చేశారు. ఆ ధైర్యంతోనే 'హంట్' సినిమా చేశా. గత ఏడాదిగా మా కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ గారి మరణం మాకు పెద్ద లాస్.  ఈ సినిమా షూటింగ్ అప్పటికి కంప్లీట్ అయ్యింది. వేరే సినిమా చేస్తున్నాను. ఆ టైమ్‌లో షూటింగ్ చేయడం కష్టమైంది. కృష్ణ విషయంలో కష్టమని తెలిసినప్పుడు షూటింగ్ చేయడం ఆపేశాను` అంటూ ఎమోషనల్‌ అయ్యారు సుధీర్‌భాబు. 

`హంట్`సినిమా గురించి చెబుతూ, ఇందులో ఓ కొత్త పాయింట్‌ని చెప్పబోతున్నామని, నిజాయతీగా చెప్పాలంటే ఏ హీరో అటెంప్ట్ కూడా చేయడని తెలిపారు. `వందల మంది సినిమా చూశారు, అందరికి నచ్చింది. నా పాత్రలో `అర్జున్‌ ఏ, అర్జున్‌ బీ రెండు షేడ్స్ ఉంటాయి. గతం మర్చిపోకముందు పోలీస్ రోల్ చేయడానికి కొంత మంది ఇన్స్పిరేషన్ ఉన్నారు. గతం మర్చిపోయిన తర్వాత క్యారెక్టర్ కోసం ఎటువంటి స్ఫూర్తి లేదు. దానికి కొంచెం కష్టపడ్డాను. కామన్ మ్యాన్ పోలీస్ అయితే ఎలా ఉంటుందని ఊహించి చేశా. స్టంట్స్ విషయంలో నేను రిస్క్ చేశానని అందరూ అంటున్నారు. నా కంటే ముందు ఆనంద ప్రసాద్ గారు రిస్క్ చేశారు. ఫారినర్లతో చేద్దామంటే ఆయన ఓకే అన్నారు. కోట్ల రూపాయలు వాళ్ళకు పంపించారు` అని వెల్లడించారు. 

`సినిమాలో ఒక్క స్లో మోషన్ షాట్ ఉండకూడదని, యాక్షన్ అంతా రియల్ గా ఉండాలని ఫారిన్ స్టంట్ మాస్టర్లతో చేశాం. ఆనంద ప్రసాద్ గారి సంస్థలో నేను 'శమంతకమణి' చేశా. అప్పటి కంటే ఇప్పుడు గౌరవం మరింత పెరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. శ్రీకాంత్ అన్నయ్య మంచి వ్యక్తి. ఈ ప్రపంచంలో ఆయనకు శత్రువులు ఎవరూ ఉండరు. ఆయన్నుంచి చాలా నేర్చుకోవాలి. మంచి యాక్టర్ కాబట్టి ఇంత లాంగ్ కెరీర్ ఉంది. నా పిల్లలు, మహేష్ పిల్లలతో కూడా ఆయన సినిమాలు చేస్తారు. భరత్ ఫెంటాస్టిక్ యాక్టర్. నా కంటే చిన్నోడు. నా చిన్నప్పుడు తన 'ప్రేమిస్తే' చూశా. నా పెర్ఫార్మన్స్ బావుండటానికి కారణం వాళ్ళు క్రియేట్ చేసిన బేస్ కారణం`.

`దర్శకుడు మహేష్ సెట్‌లో మంచి వాతావరణం క్రియేట్ చేశాడు. తాను తప్పితే ఇటువంటి డిఫరెంట్ సినిమా ఎవరు చేయలేరు. నేను ఎన్నో ప్రశ్నలు అడిగా. ఒప్పిగ్గా సమాధానం చెప్పారు. ఈ సినిమా తర్వాత నా కంటే పెద్ద హీరోలతో సినిమాలు చేస్తారు. అరుల్ విన్సెంట్ గోడలు, ఇళ్ళు ఎక్కి లైటింగ్ సెట్ చేసేవారు. 'పాపతో పైలం...' పాటతో కంటే మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సక్సెస్ అవుతుంది. ఇంతకు ముందు తెలుగులో ఎవరూ చేయని సినిమా 'హంట్'.ఇది ఒక డిఫరెంట్ ఫిల్మ్. యాక్షన్ కంటే ఎమోషనల్ సీన్స్ సినిమాను ఎక్కువ నిలబెడతాయి. సినిమా చూశాక స్పాయిలర్స్ ఇవ్వొద్దు` అని తెలిపారు సుధీర్‌బాబు. 

సుధీర్ బాబు  హీరోగా శ్రీకాంత్‌, భరత్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మహేష్‌ దర్శకత్వం వహించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న విడుదల కాబోతుంది. ఇక ఈ రోజులు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత ఆనందప్రసాద్‌, శ్రీకాంత్‌, భరత్‌, దర్శకుడు మహేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ అన్నే రవి, నటి మౌనికా రెడ్డి, నటుడు గోపరాజు రమణ పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios