శివసేన పార్టీ వ్యవస్థాపక అద్యక్షుడు బాల్ థాకరే జీవితం ఆధారంగా 'థాకరే' అనే బయోపిక్ ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది.

థాకరే పాత్రను నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ పోషించారు. ట్రైలర్ లో ఆయన పలికిన డైలాగులు దక్షిణాది ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయి. దీంతో హీరో సిద్ధార్థ్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై మండిపడ్డారు.

నవాజుద్ధీన్ లాంటి నటులు ఇలాంటి డైలాగులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దక్షిణాది ప్రజలను ఈ విధంగా అవమానిస్తారా..? అంటూ ఫైర్ అయ్యారు. ఇలా దక్షిణాది వారిని తిట్టి సొమ్ము చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదని, ఇలాంటి నీచమైన పనులను చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరాఠీల కోసం ఏర్పాటైన పార్టీ శివసేన. పార్టీ వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఇతర రాష్ట్రాలపై, ముస్లిం మైనార్టీలపై ఎన్నోసారి దాడులు చేయించారు.

అటువంటి వ్యక్తి పాత్రలో ముస్లిం నటుడైన నవాజుద్ధీన్ ని తీసుకోవడం కూడా ప్లానింగ్ లో భాగమంటూ సిద్ధార్థ్ అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కంప్లైంట్లు నమోదయ్యాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా వస్తుందో చూడాలి. చిత్రబృందం జనవరి 25న సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.