తనకు జరిగిన బైక్ ప్రమాదం గురించి మొదటిసారి సాయి ధరమ్ ఓపెన్ అయ్యారు. ఈ ప్రమాదం కారణంగా ఎదుర్కొన్న మానసిక, శారీరక వేదన చెప్పుకొచ్చాడు. 

2021 సెప్టెంబర్ నెలలో హీరో సాయి ధరమ్ ఘోర ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్ నగరంలో ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపుతప్పి గాయాలపాలయ్యారు. సాయి ధరమ్ తేజ్ నెలల తరబడి బెడ్ కి పరిమితమయ్యారు. చాలా కాలం ధరమ్ తేజ్ కంటికి కనిపించలేదు. కాగా ప్రమాదంతో తనకు ఎదురైన ఇబ్బందులు సాయి ధరమ్ తేజ్ వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఆ విషయాలు అభిమానులతో పంచుకున్నారు. 

పూర్తిగా కోలుకోవడానికి నాకు ఆరు నెలల సమయం పట్టింది. అప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేసి చూస్తే... నీ పనైపోయిందా? రిటైర్మెంట్ తీసుకున్నావా? అంటూ జోక్స్ వేశారు. నాకు చాలా బాధేసింది. నేనేమీ కావాలని విరామం తీసుకోలేదు కదా. ప్రమాదం వలన గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నేను ఎక్కువగా పుస్తకాలు చదివాను. బొమ్మలతో ఆడుకున్నాను. ప్రమాదం కారణంగా నాకు మాట పడిపోయింది. ఎప్పుడూ గలగలా మాట్లాడే నా నోటి నుండి మాటలు రావడం కష్టమైంది. 

మాట్లాడుతూ ఉంటే వచ్చేస్తుందని పేరెంట్స్ సప్పోర్ట్ చేశారు. ఇబ్బందిగా మాట్లాడుతుంటే తాగి మాట్లాడుతున్నానని కొందరు ఎగతాళి చేసేవారు. ఆ సమయంలో నాకు మాట విలువ తెలిసొచ్చింది. రిపబ్లిక్ మూవీలో నాలుగు పేజీల డైలాగ్ చెప్పిన నేను రెండు మాటలు మాట్లాడటానికి ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో సన్నిహితులు మద్దతుగా నిలిచారు. మాట సమస్యను అధిగమించాను... అని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం ఆయన విరూపాక్ష టైటిల్ తో థ్రిల్లర్ చేశారు. ఈ మూవీ ఏప్రిల్ 21న విడుదల కానుంది. ట్రైలర్ విడుదల కాగా ఆకట్టుకుంది. సంయుక్త హీరోయిన్ గా నటించారు. అలాగే మామయ్య పవన్ కళ్యాణ్ తో వినోదయ సితం రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ భగవంతుడు పాత్ర చేస్తున్నారు. ఇదే ఏడాది వినోదయ సితం రీమేక్ విడుదల కానుంది. సముద్రఖని దర్శకుడిగా ఉన్నాడు.