టాలీవుడ్ యంగ్ హీరో రామ్ నటిస్తోన్న తాజా చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ లు హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ నెల 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ లో బూతులు వినిపించిన సంగతి తెలిసిందే.. దీని గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరిగింది. ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో చూపించారంటే.. సినిమాలో మరిన్ని బోల్డ్ డైలాగ్స్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ విషయంపై తాజాగా ఓ కార్యక్రమంలో  రామ్ మాట్లాడారు. సినిమాలో పాత్రను బట్టి లాంగ్వేజ్ ఉంటుందని.. అలానే శంకర్ పాత్రను బట్టి డైలాగ్స్ ఉంటాయే తప్ప కావాలని పెట్టినవి కావని అన్నారు. సినిమా చూస్తున్న సమయంలో ఆడియన్స్ బూతులు ఉండటాన్ని తప్పుబట్టరని.. శంకర్ పాత్ర అలాంటిది కాబట్టి పర్వాలేదని అనుకుంటారని తెలిపారు.

తల్లితండ్రులు లేకుండా స్లమ్ లో పెరిగిన కుర్రాడు ఇలా మాట్లాడితేనే సహజంగా ఉంటుందనే అభిప్రాయాన్ని రామ్ వ్యక్తం చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ కూడా ఒక సందర్భంలో 'నువ్ ఎందుకు ఇలా ఉంటావ్..?' అని అడుగుతుంది. అప్పుడు శంకర్ చెప్పే సమాధానం చాలా కన్విన్సింగ్ గా ఉంటుందని రామ్ అన్నారు.