సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే బ్లాక్ బస్టరే... అయితే రజినీకి అసూయ ఎందుకు?
రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. ఈ మూవీలోని కావాలయ్యా సాంగ్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కాగా ఈ సాంగ్ విషయంలో రజినీకాంత్ అసూయ వ్యక్తం చేశారు.

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ మూవీ తెరకెక్కింది. రజినీకాంత్ హీరోగా నటించారు. ఆగస్టు 10న జైలర్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా... మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, రమ్యకృష్ణ, సునీల్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించారు. కాగా 'కావాలయ్యా' సాంగ్ విపరీతమైన ఆదరణ పొందింది. సోషల్ మీడియాను ఈ సాంగ్ ఊపేస్తోంది. సామాన్యులు, సెలెబ్రిటీలు ఈ సాంగ్ కి స్టెప్స్ వేస్తున్నారు.
ఈ సాంగ్ విషయంలో రజినీకాంత్ తన అసూయ వ్యక్తం చేశాడు. కావాలయ్యా సాంగ్ దాదాపు ఆరు రోజులు షూట్ చేశారు. నాకు ఒక్క రోజు కూడా షూటింగ్ లో పాల్గొనే అవకాశం రాలేదన్నారు. ప్రధానంగా తమన్నా, డాన్సర్స్ మీద ఈ సాంగ్ షూట్ చేసినట్లు తెలుస్తుంది. కావాలయ్యా సాంగ్ లో రజినీకాంత్ కనిపిస్తారు కానీ.. వయసు రీత్యా ఆయనతో పెద్దగా డాన్స్ చేయించలేదని తెలుస్తుంది. ఇంత పాప్యులర్ సాంగ్ లో తనకు పెద్దగా స్పేస్ లేదని రజినీకాంత్ పరోక్షంగా చెప్పారు.
అయితే కావాలయ్యా సాంగ్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఇది తెలుగు లిరిక్స్ తో మొదలవుతుంది. చంద్రముఖి మూవీలో 'దేవుడ దేవుడా' సాంగ్ కూడా తెలుగు పదాలతో మొదలవుతుంది. చంద్రముఖి రజినీకాంత్ కెరీర్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా ఉంది. ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే రజినీకాంత్ కి జైలర్ రూపంలో భారీ విజయం దక్కుతుందని కొందరు అంచనా వేస్తున్నారు.
రజినీకాంత్ తన రేంజ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ముఖ్యంగా తెలుగులో ఆయనకు ఒకప్పటి ఫేమ్ లేదు. రజినీకాంత్ సినిమాలు పూర్తి స్థాయిలో మెప్పించలేకపోతున్నాయని ప్రేక్షకుల అభిప్రాయం. జైలర్ తో కమ్ బ్యాక్ అవుతారేమో చూడాలి.