హీరో రాజశేఖర్‌ కోలుకున్నారు. ఆయన కరోనా నుంచి బయటపడ్డారు. సోమవారం సాయంత్రం వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని రాజశేఖర్‌ భార్య, నటి జీవితా రాజశేఖర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఓ వీడియోని విడుదల చేశారు. రాజశేఖర్‌గారు విజయవంతంగా కరోనా నుంచి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం బాగుందని తెలిపారు. ఈ సందర్బంగా సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రి బృందానికి, వైద్యులకు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. 

సిటీ న్యూరో సెంటర్‌ డాక్టర్‌ కృష్ణగారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఆధ్వర్యంలో 24 గంటలు రాజశేఖర్‌ గారిని పర్యవేక్షించినట్టు తెలిపారు. రాజశేఖర్‌ కోలుకోవడానికి సపోర్ట్ చేసిన వారికి, అభిమానులు, బంధుమిత్రలకు జీవిత ధన్యవాదాలు తెలిపారు. 

రాజశేఖర్‌ అక్టోబర్‌ 17న తనకు, తన ఫ్యామిలీకి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యిందని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని చిత్ర వర్గాలు స్పందించి కోరుకున్నారు. అయితే మధ్యలో నాన్న ఆరోగ్యం ఆందోళన కరంగా ఉందని ఆయన కూతురు శివాత్మిక ఓ ట్వీట్‌ చేశారు. దీంతో సినీ వర్గాలు, అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు ఐసీయూలో ట్రీట్‌మెంట్‌ అందించారు. మొత్తానికి 23రోజుల తర్వాత రాజశేఖర్‌ కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో అభిమానులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.