Pawan Kalyan: పవన్ కొత్త మూవీ షురూ!
ఇటీవల పవన్ వరుసగా కొన్ని చిత్రాలు ప్రకటించారు. అందులో సుజీత్ దర్శకత్వంలో ఓజీ ఒకటి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చారు.

పవన్ ఒక ప్రక్క సీరియస్ పొలిటీషియన్ గా కొనసాగుతూనే కొత్త చిత్రాలు ప్రకటిస్తున్నారు. 2018లో అజ్ఞాతవాసి మూవీ విడుదల అనంతరం ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పారు. 2019 చివర్లో కమ్ బ్యాక్ ప్రకటించారు. ఈ మూడేళ్ళలో పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు విడుదల చేశారు. హరి హర వీరమల్లు సెట్స్ పై ఉంది. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం.
హరీష్ శంకర్ తో చాలా రోజుల క్రితం భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ ప్రకటించారు. అది అనుకోని కారణాలతో క్యాన్సిల్ అయ్యింది. ఆ సినిమా స్థానంలో తేరి రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు. అలాగే వినోదయ చిత్తం రీమేక్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. వీటితో పాటు దర్శకుడు సుజీత్ తో ఒక స్ట్రయిట్ మూవీ ప్రకటించారు. గత ఏడాది #OG అనే వర్కింగ్ టైటిల్ తో కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు.
ఆర్ ఆర్ ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తుండగా రేపు గ్రాండ్ గా స్టార్ట్ అవుతుంది. పవన్-సుజీత్ చిత్ర పూజా కార్యక్రమం జనవరి 30న హైదరాబాద్ లో ఘనంగా జరగనుంది. హీరో పవన్ తో పాటు దర్శక నిర్మాతలు, చిత్ర ప్రముఖులు ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. త్వరలో రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. హీరోయిన్ తో పాటు ఇతర నటుల వివరాలు తెలియాల్సి ఉంది.
ఓజీ మూవీ ముంబై-జపాన్ నేపథ్యంలో సాగే మాఫీయా స్టోరీ అంటూ ప్రచారం జరుగుతుంది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ఫైట్స్, సాంగ్స్ ఉండవట. సాంగ్స్ లేవంటే ఓకే. మాఫియా మూవీలో ఫైట్స్ లేవంటే నమ్మబుద్ధి కావడం లేదు. దీనిపై క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఎదురు చూడాలి. ఇక 2019లో సాహో విడుదల కాగా ఇన్నేళ్లకు సుజీత్ మెగా ఫోన్ పట్టనున్నారు.
ఈ ఏడాది పవన్ నుండి హరి హర వీరమల్లు విడుదల కానుంది. వినోదయ సిత్తం రీమేక్ సైతం రిలీజ్ అయ్యే అవకాశం కలదు. అధికారికంగా నాలుగు చిత్రాలు పవన్ నుండి భవిష్యత్ లో రానున్నాయి. రెండేళ్లుగా హరీష్ శంకర్ ఎదురుచూస్తున్నా ఆయన చిత్రాన్ని పవన్ పట్టాలెక్కించడం లేదు. సుజీత్ మూవీ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పవన్ హరీష్ మూవీ ఏం చేయనున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.