ప్రముఖ మీడియా సంస్థ అధినేతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ప్యాకేజీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఫైర్ అవుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ మొదలైంది. రానున్న ఏడాది కాలం చాలా కీలకం. రాజకీయ పార్టీల నిర్ణయాలు, అజెండాలు, చర్యలు గెలుపోటములు డిసైడ్ చేస్తాయి. నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రణాళికలు వేస్తున్నారు. జనాల మైండ్స్ ట్యూన్ చేసే కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో గెలుపు లక్ష్యంగా పొత్తులు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణాలోని మూడు ప్రధాన పార్టీల మధ్య వైరం నడుస్తుంది. కాబట్టి ఇక్కడ పొత్తు పొడిచే ఆస్కారం లేదు. బిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ విడివిడిగా పోటీకి వెళ్లనున్నారు. ఏపీ రాజకీయం మాత్రం రసవత్తరంగా ఉంది.
పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేది లేదని స్పష్టంగా చెప్పారు. దానర్థం టీడీపీతో ఆయన మళ్ళీ జతకడుతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. చంద్రబాబు పట్ల పవన్ వైఖరి చాలా సానుకూలంగా ఉంది. ఇద్దరూ మిత్రులు మాదిరి మెదులుతున్నారు.ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కామన్ టార్గెట్ వైసీపీగా ఉంది. జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ కనీసం అప్పుడప్పుడు టీడీపీ నేతల మీద విమర్శలు చేస్తుంటారు. జనసేన మాత్రం ఏక పక్షంగా వైసీపీని దెబ్బకొట్టడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకుంది.
మధ్యలో మేమున్నామంటూ బిఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టింది. కొందరు పేరున్న కాపునేతలు ఆ పార్టీలో చేరారు. టీడీపీ-జనసేన పొత్తుపెట్టుకున్నప్పటికీ... వైసీపీకి నష్టం జరగకుండా ఉండేదుకు కేసీఆర్ తో కలిసి వైఎస్ జగన్ పన్నిన వ్యూహంలో భాగంగా బిఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టిందని, టీడీపీ వర్గాల ఆరోపణ. అలా ఒక ప్రచారం జరుగుతుండగా ఓ మీడియా అధినేత సంచలన కథనం ప్రచురించారు. పవన్ కళ్యాణ్ కి కేసీఆర్ ఏకంగా వెయ్యి కోట్లు ఆఫర్ చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సీఎం పదవి డిమాండ్ చేయాలని, ఆ విధంగా చంద్రబాబు నాయుడిని దెబ్బకొట్టాలని కేసీఆర్ పవన్ కి సందేశం పంపారట.
పవన్ వద్దకు కేసీఆర్ తన మనుషులను పంపి తాము చెప్పినట్లు వింటే వెయ్యి కోట్లు ఇస్తానని డీల్ మాట్లాడించారని సదరు మీడియా అధినేత విశ్లేషణ. ఈ వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. ఆల్రెడీ చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకొని రాజకీయాలు చేస్తున్నారన్న అపవాదులు పవన్ మోస్తున్నారు. కొత్తగా కేసీఆర్ వెయ్యికోట్ల ప్యాకేజ్ ఆఫర్ చేశారంటూ వివాదానికి తెరలేపారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఆ మీడియా అధినేతను బ్రోకర్ అని సంబోధిస్తూ నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఉదయం నుండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన్ని ఏకిపారేస్తున్నారు. నేషనల్ వైడ్ నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. ఈ పరిణామం చంద్రబాబుకు కీడు చేసేదిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. రేపు పవన్ పొత్తు ప్రకటన చేస్తే... టీడీపీ మీడియాగా పేరుగాంచిన ఛానల్ అధినేత కామెంట్స్ గుర్తు చేసుకొని, తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. పొత్తు వలన టీడీపీకి దక్కే ప్రయోజనం పవన్ అభిమానుల్లో ఉన్న వ్యతిరేకత వలన నీరుగారే ఆస్కారం కలదు. టీడీపీ మేలుకోరే సదరు మీడియా సంస్థ ఇలాంటి ఆరోపణ ఎందుకు చేసిందనేది ఆసక్తికరం...
