తెలుగు సినిమా ఏకంగా 11 జాతీయ అవార్డులు కొల్లగొట్టిన వేళ హీరో నాని అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సోషల్ మీడియా వేదికగా ఆయన అసహనం తెలియజేశారు.
ఆగస్టు 24న ఢిల్లీ వేదిక భారత ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్ ప్రకటించింది. ఎన్నడూ లేని విధంగా తెలుగు సినిమా సత్తా చాటింది. నేషనల్ అవార్డ్స్ లో ప్రధానంగా భావించే ఉత్తమ నటుడు అవార్డు టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కి దక్కింది. పుష్ప చిత్రంలోని నటనకు గానూ ఈ అవార్డు ఆయనను వరించింది. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ 6 విభాగాల్లో అవార్డ్స్ కైవసం చేసుకుంది. చంద్రబోస్ కొండపొలం చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెనకు అవార్డు దక్కింది. మొత్తంగా టాలీవుడ్ కి 11 విభాగాల్లో అవార్డులు దక్కాయి.
నేషనల్ అవార్డు విన్నర్స్ కి శుభాకాంక్షలు చెప్పిన నాని, అదే సమయంలో అసంతృప్తి వ్యక్తం చేశాడు. జై భీమ్ చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాకపోవడమే ఇందుకు కారణం. సూర్య హీరోగా దర్శకుడు టీజే జ్ఞానవేల్ జై భీమ్ చిత్రం తెరకెక్కించారు. ఇది మద్రాస్ హైకోర్టు మాజీ జడ్జి ఆర్ చంద్రు జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. ఆర్ చంద్రు పాత్రలో సూర్య నటించారు.

జై భీమ్ అణగారిన వర్గాలపై జరుగుతున్న పోలీస్ వ్యవస్థ దురాగతాలను ఎత్తి చూపుతూ వాస్తవ సంఘటనల స్ఫూర్తితో తెరకెక్కించారు. నేరుగా ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సామాజిక అంశాలతో తెరకెక్కిన జై భీమ్ చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాలేదు. దీంతో నాని జై భీమ్ అని రాసి పక్కనే బ్రేక్ అయిన హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశాడు. ఒక మంచి చిత్రానికి అన్యాయం జరిగిందన్నట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు.
నిజానికి ఉత్తమ నటుడు విభాగంలో జై భీమ్ నుండి సూర్య పోటీపడ్డారు. అయితే అల్లు అర్జున్ ని అవార్డు వరించింది. సూర్య కంటే అల్లు అర్జున్ గొప్ప నటుడా అని కొందరు ప్రశ్నించడం విశేషం. నాని అసహనానికి మరో కారణం కూడా ఉంది. శ్యామ్ సింగరాయ్ కి ఆయన అవార్డు ఆశించారని వినికిడి. ఉప్పెన చిత్రానికి ఉత్తమ తెలుగు సినిమా అవార్డు వచ్చింది. ఉప్పెన కంటే ఆ అర్హత ఆర్ ఆర్ ఆర్ లేదా శ్యామ్ సింగరాయ్ చిత్రాలకు ఉందని కొందరి భావన. ఏది ఏమైనా నేషనల్ అవార్డ్స్ పై నాని నేరుగా అసహనం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది..
