టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ రానా దగ్గుబాటి తన బ్యాచిలర్‌ లైఫ్‌ కు గుడ్ బై చెపుతున్నట్టుగా ప్రకటించేశాడు. మంగళవారం తన ప్రియురాలిని పరిచయం చేయగా రానా తండ్రి సురేష్ బాబు ఈ ఏడాదిలోనే రానా పెళ్లి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే నితిన్‌ పెళ్లి పనులు ప్రారంభించగా మరో యంగ్ హీరో నిఖిల్‌ గురువారం ఉదయం పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇప్పుడు రానా పెళ్లి వార్తతో టాలీవుడ్‌కు పెళ్లి కళ వచ్చినట్టైంది.

అయితే రానాకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి శతమనాం భవతి అంటూ యువ జంటను ఆశీర్వదించగా యంగ్ జనరేషన్ హీరోలు సరదాగా ఆటపట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేచురల్ స్టార్ నాని ఆసక్తికర ట్వీట్ చేశాడు. రానా తన ప్రేయసిని పరిచయం చేస్తూ చేసిన ట్వీట్‌ను షేర్ చేసిన నాని `ఇంకా ఏమేమి చూడాల్సివస్తుందో 2020 లో.. ఈ సందర్భంగా నీకు ఈ పాటను డెడికేట్ చేస్తున్నా` అంటూ పాత బజాజ్‌ యాడ్‌ ను షేర్ చేశాడు. రానా చేసుకోబేయే అమ్మాయి మిహికా ఇంటి పేరు కూడా బజాజ్‌ కావటం నాని ఈ సాంగ్‌ను డెడికేట్‌ చేశాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాని తొలిసారిగా పూర్తి స్థాయి నెగెటివ్‌ రోల్‌లో నటిస్తుండగా సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్నాడు. నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది.